కాంగ్రెస్​లో చేరిన ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

కాంగ్రెస్​లో చేరిన ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
  • పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్

నిర్మల్/ ఆదిలాబాద్, వెలుగు: నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జి.విఠల్ రెడ్డి గురువారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు రేవంత్​తో పాటు జిల్లా ఇన్​చార్జ్ మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2014లో విఠల్ రెడ్డి కాంగ్రెస్ నుండి ముథోల్ ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ లో చేరారు.

ఆ తర్వాత 2018లో బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా మరోసారి విజయం సాధించారు. కాగా, 2023లో ఆయన తిరిగి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇదిలా ఉండగా విఠల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా కూడా వ్యవహరిస్తున్నారు. కొద్ది రోజులుగా విఠల్ రెడ్డి కాంగ్రెస్​లో చేరే విషయమై అధిష్టానంతో రహస్యంగా చర్చిస్తూ వచ్చారు.

స్థానిక మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు నారాయణరావు పటేల్ విఠల్ రెడ్డి చేరికను వ్యతిరేకించడంతో ఆయన తనవంతు ప్రయత్నాలను ముమ్మరం చేసి ఎట్టకేలకు కారు దిగి హస్తం గూటికి చేరుకున్నారు. మరికొద్ది రోజుల్లో పలువురు సీనియర్ నేతలు కూడా బీఆర్ఎస్ ను వీడబోతున్నారన్న ప్రచారం ఆ పార్టీని మరింత కలవరపెడ్తున్నది. 

కాంగ్రెస్ లోకి ఆత్రం సుగుణ 

కాంగ్రెస్  ఎంపీ అభ్యర్థి విషయంలో రోజురోజుకు సమీకరణాలు మారుతున్నాయి. తాజాగా ఆదివాసీ మహిళ, ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణ గురువారం హైదరాబాద్​లోని సీఏం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.  తన టీచర్  ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్  కండువా కప్పుకున్నారు. దీంతో ఎంపీ టికెట్  సుగుణకే కన్ఫం అయినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.

కొంత కాలంగా ఆమె ఎంపీ టికెట్ ఆశిస్తున్న విషయం తెలిసిందే. మొన్న సీఏం నుంచి పిలుపు రావడంతో డాక్టర్  సుమలతకు ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. తాజాగా ఆత్రం సుగుణ కాంగ్రెస్ లో చేరడం వెనుక దాదాపు టికెట్ ఖరారైనట్లేనని కాంగ్రెస్  వర్గాలు చెబుతున్నాయి. మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మద్దతుతోనే ఆత్రం సుగుణ కాంగ్రెస్ లోకి వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆమెకు ఎంపీ టికెట్ ఇచ్చే విషయంలో సీతక్క చొరవ తీసుకుంటారని సమాచారం. అభ్యుదయ భావాలు ఉన్న సుగుణ.. ఆదివాసీల సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేశారు.

ఈ క్రమంలోనే ఆదివాసీ అమ్మగా ఆమె గుర్తింపు పొందారు. ఆమె భర్త ఆత్రం భుజంగ్  రావు మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. 1995లోనే ఆమె జన్నారం మండలంలోని ముర్రిమడుగు నుంచి కాంగ్రెస్  ఎంపీటీసీగా గెలిచారు. 2008లో టీచర్  ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం ఉట్నూరు జడ్పీ స్కూల్​లో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు.