అప్పుల బాధతో మాజీ నక్సలైట్ ఆత్మహత్య

అప్పుల బాధతో మాజీ నక్సలైట్ ఆత్మహత్య

ఇల్లెందు: అజ్ఙాతం వీడి జనజీవన స్రవంతిలో కలిసిన నక్సలైట్ అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇల్లెందు పట్టణంలోని సత్యనారాయణపురానికి చెందిన జాల కన్నయ్య(65)  అజ్ఙాత దళంలో ఏడు సంవత్సరాలు పని చేశాడు. అప్పటి ఉమ్మడి రాష్ర్ట ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో  పోలీసుల  సమక్షంలో లొంగిపోయాడు.

పునారవాసం కింద వచ్చిన భూమి కబ్జాకు గురవ్వడంతో సత్యనారాయణపురంలో పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. తనకున్న ఐదు ఎకరాల భూమిలో మొక్కజొన్న పంట సాగు చేశాడు. పంట సాగు చేసే క్రమంలో కన్నయ్యకు సుమారు రూ.4లక్షల వరకు అప్పు అయ్యింది. దీనికి తోడు ఈ ఏడాది పంట కూడ కోతుల బెడద, భారీ వర్షాల కారణంగా దెబ్బతినడంతో ఆర్ధికంగా నష్టపోయాడు. 

అప్పుల విషయంలో కుటుంబంలో నెలకొన్న సమస్యలతో సోమవారం పురుగుల మందు తాగాడు. కుటంబ సభ్యులు చికిత్స కోసం  ప్రభుత్వ ఆసుపత్రికు తరలించారు. చికిత్స పొందుతున్న క్రమంలో ఇవాళ సాయంత్రం కన్నయ్య మృతి చెందాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. అప్పుల భాదతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎన్డీ పార్టీ ఇల్లెందు డివిజన్ సహయక కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు, టీఆర్ఎస్ కౌన్సిలర్ పద్మవతి, టీఆర్ఎస్ నాయకులు మేకల శ్యామ్ తదితరులు కోరారు.