
శాంతినగర్ / అయిజ, వెలుగు : దేశంలోని ప్రజలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని పాండిచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి అన్నారు. శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల కేంద్రమైన శాంతినగర్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన సంఘటన సృజన్ అభియాన్ కు మాజీ సీఎం నారాయణస్వామితోపాటు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసిన భారత్ జూడో యాత్రలో రైతులు, మహిళలు, యువత, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారని తెలిపారు.
దేశంలో ఓటు చోరీతో మోదీ, అమిత్ షా, ఎన్నికల సంఘం కుమ్మక్కై బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. రాహుల్ గాంధీ నేతృతంలో ఓట్ చోరీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ మంచి పాలన సాగిస్తున్నారని కితాబిచ్చారని చెప్పారు. ప్రజాస్వామ్య పద్ధతిలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులను ఎన్నుకోవాలనే ఉద్దేశంతో సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.
కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నాయకులు...
అయిజ సింగిల్ విండో మాజీ చైర్మన్ సంకాపూర్ రాముడు, మాజీ జడ్పీటీసీ చిన్న హనుమంతు, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు కాంగ్రెస్ లో చేరారు. వారికి ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయం నుంచి ఉత్తనూర్ చౌరస్తాలోని కాంగ్రెస్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఆలయాలను దర్శించుకున్న మాజీ సీఎం..
అలంపూర్, వెలుగు : జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను పాండిచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత దర్శించుకున్నారు.