పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే అసెంబ్లీని ముట్టడిస్తాం : జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్‌

పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే అసెంబ్లీని ముట్టడిస్తాం :  జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్‌
  •     మాజీ  సర్పంచుల సంఘం హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మాజీ సర్పంచుల పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని, లేదంటే ఈనెల 30న అసెంబ్లీని ముట్టడిస్తామని మాజీ సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్‌ హెచ్చరించారు. మాజీ  సర్పంచుల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్​ పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 నెలలుగా పెండింగ్‌ బిల్లులు చెల్లించకుండా మాజీ సర్పంచులపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. 2019 నుంచి 2024 వరకు పదవిలో ఉన్న సర్పంచులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు అప్పులు తెచ్చి మరీ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్​చేశారు.