తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు మీరా కుమార్   

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు మీరా కుమార్   

హైదరాబాద్​, వెలుగు : తెలంగాణ ఆవిర్భావ వేడుకలను కాంగ్రెస్​ పార్టీ ఘనంగా నిర్వహించనుంది. రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్సేనంటూ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యక్రమాలను రూపొందిస్తున్నది. అన్ని గ్రామాల్లోనూ సోనియా గాంధీ ఫొటోకు పాలాభిషేకం చేయడంతో పాటు కాంగ్రెస్​ కార్యకర్తలు తమ ఇంటిపై పార్టీ జెండా ఎగురవేయాలని పార్టీ సూచించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లోక్​సభ మాజీ స్పీకర్​ మీరా కుమార్​ను ఆవిర్భావ వేడుకలకు పీసీసీ ఆహ్వానించింది. జూన్​ 2న గాంధీ భవన్​లో నిర్వహించనున్న వేడుకల్లో ఆమె పాల్గొంటారని పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​  మంగళవారం ప్రకటించారు. పీసీసీ ఆధ్వర్యంలో ఆమెకు ఘనంగా సన్మానం నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటులో అప్పటి స్పీకర్​ మీరా కుమార్​ కీలక భూమిక పోషించారని, అందుకే వేడుకలకు ఆమెను ఆహ్వానించామని చెప్పారు. కాగా, జూన్​ 2న ఉదయం 10.30 గంటలకు గాంధీ భవన్​లో జెండాను ఆవిష్కరించనున్నారు. 11 గంటలకు నిజాం​కాలేజీ దగ్గర ఉన్న బాబూ జగ్జీవన్​ రామ్​ విగ్రహం నుంచి గాంధీ భవన్​ వరకు భారీ ర్యాలీ తీయనున్నారు. ర్యాలీని మీరా కుమార్​ జెండా ఊపి ప్రారంభించనున్నారు. 

చిన్నారెడ్డి చైర్మన్​గా పీసీసీ వేడుకల కమిటీ.. 

ఆవిర్భావ వేడుకల నిర్వహణకు పీసీసీ చీఫ్​ రేవంత్​ 29 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ చైర్మన్​గా చిన్నారెడ్డిని నియమించారు. మాజీ ఎమ్మెల్సీ బి.కమలాకర్​ రావు, పీసీసీ ఇంటెలెక్చువల్​ సెల్  చైర్మన్ ఎ.శ్యామ్​మోహన్ ను కో చైర్మన్లుగా, పీసీసీ సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్​ జి.నిరంజన్, చెరుకు సుధాకర్​ను కన్వీనర్లుగా నియమించారు. రంగారెడ్డి, మేడ్చల్​ మల్కాజిగిరి, హైదరాబాద్, ఖైరతాబాద్, సికింద్రాబాద్​ డీసీసీ ప్రెసిడెంట్లు చల్లా నర్సింహా రెడ్డి, నందికంటి శ్రీధర్, సమీర్​ వలీలుల్లా, రోహిన్​ రెడ్డి, అనిల్​ కుమార్​ యాదవ్​ను కోఆర్డినేటర్లుగా నియమించారు. బెల్లయ్య నాయక్, అద్దంకి దయాకర్, మానవతా రాయ్​ తదితరులను సభ్యులుగా కమిటీలో చోటు కల్పించారు.