శ్రీలంక మాజీ అధ్యక్షుడు అరెస్టు.. ప్రజా నిధుల దుర్వినియోగం కేసులో సంచలనం..

శ్రీలంక మాజీ అధ్యక్షుడు అరెస్టు..  ప్రజా నిధుల దుర్వినియోగం కేసులో సంచలనం..

శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేను కొలంబోలో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) అరెస్ట్ చేసింది. అతను అధ్యక్ష పదవిలో ఉండగా యునైటెడ్ కింగ్‌డమ్‌ పర్యటన కోసం ప్రజా నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణల పై విచారణకు హాజరైన తర్వాత ఈ అరెస్ట్ జరిగింది.

రణిల్ విక్రమసింఘే 2022 నుండి 2024 వరకు శ్రీలంక అధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే 2023 సెప్టెంబర్‌లో వోల్వర్‌హాంప్టన్ యూనివర్శిటీలో అతని భార్య ప్రొఫెసర్ మైత్రీ విక్రమసింఘే పీహెచ్‌డీ గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరయ్యేందుకు ప్రభుత్వ నిధులను వినియోగించారా లేదా అనే దానిపై కూడా దర్యాప్తు జరుగుతోంది.

పోలీసుల ప్రకారం క్యూబా, అమెరికా పర్యటనల్లో భాగంగా ఈ ట్రిప్ వ్యక్తిగత కారణాలతో యూకేను కూడా చేర్చింది. లండన్ పర్యటనలో ఎలాంటి అధికారిక కార్యక్రమాలు లేవని, కానీ అందుకు దాదాపు రూ. 16.9 కోట్ల  ప్రజా నిధులను ఖర్చు చేశారని తెలిపారు. మాజీ అధ్యక్షుడితో పాటు పది మంది టీం కూడా ప్రయాణించారని CID తెలిపింది.

ఈ నెల మొదట్లో ఈ పర్యటనకి సంబంధించి విక్రమసింఘే మాజీ అధ్యక్ష కార్యదర్శి సమన్ ఏకనాయకే, ఆయన మాజీ ప్రైవేట్ కార్యదర్శి సాండ్రా పెరెరాలను CID అధికారులు ప్రశ్నించారు. ఈ దర్యాప్తులో మరికొందరు మాజీ సిబ్బందిని కూడా ప్రశ్నించే అవకాశం ఉందని CID తెలిపింది.

►ALSO READ | సౌత్ అమెరికాలో భారీ భూకంపం: 57 వేల మంది సేఫ్.. 700 కి.మీ దూరంలో...

ఈ ఆరోపణలను విక్రమసింఘే ఆఫీస్ ఖండించింది. ఈ వార్తలు ఇంకా ప్రజలని తప్పుదారి పట్టిస్తున్నాయని తెలిపింది. తప్పుగా  చెబుతున్న  తేదీలలో ఎవరూ వోల్వర్‌హాంప్టన్ యూనివర్శిటీకి వెళ్లలేదని, దీనిపై అధికారిక ప్రకటన చేస్తామని ఆయన మీడియా బృందం తెలిపింది.

ఈ అరెస్టుతో శ్రీలంకలో ప్రస్తుత కాలంలో అరెస్ట్ అయిన అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడిగా విక్రమసింఘే నిలిచారు. దేశంలో ఉన్నత స్థాయి అవినీతిని అరికట్టాలని ఒత్తిడి పెరుగుతున్న సమయంలో ఈ అరెస్ట్ జరిగింది. 

రణిల్ విక్రమసింఘే రాజకీయ జీవితం: యునైటెడ్ నేషనల్ పార్టీ (UNP) నాయకుడు రణిల్ విక్రమసింఘే దాదాపు ఐదు దశాబ్దాలుగా శ్రీలంక రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా ఉన్నారు. 1977లో తొలిసారి పార్లమెంటుకు ఎన్నికైన ఆయన ఆరు సార్లు ప్రధానమంత్రిగా, 2022లో దేశ ఆర్థిక సంక్షోభం సమయంలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన రాజకీయ జీవితంలో  ముఖ్యంగా, 1980, 90లలో బటలండ హింస సముదాయంలో ఆయన ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి.  

బెయిల్ విచారణ కోసం CID విక్రమసింఘేను కొలంబో మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరచనుంది. ఈ అరెస్టు శ్రీలంక అవినీతి నిరోధక చర్యల్లో ఒక కొత్త దశను సూచిస్తుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే నెలల్లో మరిన్ని ఉన్నత స్థాయి వ్యక్తులపై దర్యాప్తు జరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.