మహిళా ఐపీఎస్‌పై లైంగిక వేధింపులు.. మాజీ ADGPకి మూడేళ్ల జైలు

మహిళా ఐపీఎస్‌పై లైంగిక వేధింపులు.. మాజీ ADGPకి మూడేళ్ల జైలు

చెన్నై : మహిళా ఐపీఎస్ పై లైంగిక ఆరోపణల కేసులో తమిళనాడు మాజీ అదనపు డీజీపీ రాజేష్‌ దాస్‌ కు మూడేళ్ల శిక్ష విధించింది న్యాయస్థానం. ఓ మహిళా పోలీసు అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నిర్ధారిస్తూ.. విల్లుపురం కోర్టు రాజేష్ దాస్ కు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతోపాటు రూ.10 వేల జరిమానా కూడా వేసింది. దీనిపై ఆయన అప్పీలుకు వెళ్లేందుకు 30 రోజుల గడువు ఇవ్వడంతో పాటు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తీర్పులో పేర్కొంది న్యాయస్థానం. 

అసలు ఈ కేసు కథేంటి..? 

2021, ఫిబ్రవరిలో ఎడప్పాడి కె. పళనిస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన సభకు బందోబస్తు నిర్వహించేందుకు వాహనంలో వెళ్తున్న సమయంలో సీనియర్‌ ఐపీఎస్‌ రాజేష్ దాస్.. తనను లైంగికంగా వేధించాడని 2021, ఫిబ్రవరిలో ఓ మహిళా ఐపీఎస్ ఫిర్యాదు చేసింది. ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్న  ఏఐఏడీఎంకే ప్రభుత్వం..రాజేష్ దాస్ ను సస్పెండ్ చేసింది. విచారణ కోసం ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. 

ఐపీఎస్‌ అధికారి లైంగిక వేధింపుల కేసు 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు ప్రచారాస్త్రంగా మారింది. అధికారంలోకి వచ్చిన తర్వాత సదరు ఐపీఎస్‌ అధికారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న ఎంకే స్టాలిన్‌ (ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి) హామీ ఇచ్చారు. 

మరోవైపు ఈ కేసును అప్పట్లో మద్రాస్‌ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. డీజీపీ స్థాయి వ్యక్తిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం, ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న మహిళా ఐపీఎస్‌ను మరో అధికారి అడ్డుకోవడం షాక్‌కు గురి చేస్తోందని అభిప్రాయపడింది. ఈ కేసు దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని పేర్కొంది. అయితే.. ఈ  కేసులో ఫిర్యాదుదారుని రీకాల్‌ చేసి క్రాస్‌ఎగ్జామిన్‌ చేయాలని కోరుతూ రాజేష్ దాస్‌ వేసిన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు 2023, ఏప్రిల్‌లో కొట్టివేసింది.

ఇదే కేసులో అప్పటి చెంగల్‌పట్టు ఎస్పీ కన్నన్‌కూ న్యాయస్థానం జరిమానా విధించింది. రాజేష్‌ దాస్‌పై ఫిర్యాదు చేసేందుకు చెన్నై వెళ్తోన్న ఆ మహిళా అధికారిణిని అడ్డుకున్నందుకు ఆయన్ను దోషిగా తేల్చిన న్యాయస్థానం.. రూ.500 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.