కేసీఆర్‌‌.. కేంద్రాన్ని ప్రశ్నించడం లేదేం?

కేసీఆర్‌‌.. కేంద్రాన్ని ప్రశ్నించడం లేదేం?

బడ్జెట్‌‌లో వాటా తగ్గినా మౌనమెందుకు
పన్నుల వాటాలో తెలంగాణ 5వేల కోట్లు నష్టపోయింది
మాజీ కేంద్రమంత్రి చిదంబరం

హైదరాబాద్‌, వెలుగుదేశ ఆర్థిక పరిస్థితి ఐసీయూలో ఉందని, దానికి చికిత్స చేసే పరిస్థితి కూడా లేదని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అన్నారు. పన్నుల పంపిణీలో రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని, మొత్తం ఎనిమిదిన్నర లక్షల కోట్లకుగాను మోడీ సర్కారు ఆరున్నర లక్షల కోట్లే పంచిందని ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన పన్నుల వాటాలో ఈసారి ఐదు వేల కోట్లు నష్టపోయిందని.. అయినా కేసీఆర్‌ కేంద్రాన్ని ప్రశ్నించడం లేదేమని నిలదీశారు. బడ్జెట్​వాటా తగ్గినా మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. కేసీఆర్​ ఒకసారి కేంద్రానికి అనుకూలంగా, మరోసారి వ్యతిరేకంగా మాట్లాడుతారని విమర్శించారు. శనివారం ఏఐసీసీ రీసెర్చ్​ డిపార్ట్​మెంట్​(తెలంగాణ) ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని ఓ కాలేజీలో ‘కేంద్ర బడ్జెట్–2020’పై సమావేశం నిర్వహించారు. చిదంబరం ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దేశ ఆర్థిక పరిస్థితికి అద్దం పట్టే రిపోర్ట్‌ బడ్జెట్‌ అని.. దాన్ని పరిశీలిస్తే మన పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుందని చెప్పారు.

అన్ని రంగాలు దెబ్బతిన్నయి

కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో చెప్పినవన్నీ అంకెల గారడేనని చిదంబరం విమర్శించారు. ఆర్థిక పరిస్థితి తిరోగమన దిశలో ఉందని చెప్పారు. ‘‘ఎనిమిది నెలలుగా దేశంలోకి దిగుమతులు పడిపోయాయి. ఆరు నెలలుగా ఎగుమతులు కూడా తగ్గిపోయాయి. బొగ్గు, పెట్రోలియం, నేచురల్‌ గ్యాస్‌ ఉత్పత్తి నెగటివ్‌గానే ఉంది. దేశంలోని ఏ ఇండెక్స్‌ను తీసుకున్నా పాజిటివ్‌గా లేదు. పెద్ద నోట్ల రద్దుతో మీడియం, స్మాల్‌ ఇండస్ట్రీలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 2019-–20 బడ్జెట్లో కేటాయించిన మేర నిధులను ఖర్చు చేయలేదు. వ్యవసాయానికి ప్రాధాన్యత లేకుండా పోయింది. ఆహార అవసరాలకు మోడీ సర్కారు లక్ష కోట్లు తగ్గించింది. ఇన్‌ కం ట్యాక్స్‌లో తీసుకొచ్చిన కొత్త స్కీం గందరగోళంగా ఉంది” అని పేర్కొన్నారు.

పేదలకు లాభమేం లేదు

మోడీ నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ బాగా దిగజారిపోయిందని చిదంబరం ఆరోపించారు. దేశానికి భారీ పెట్టుబడులు రావడం లేదన్నారు. గ్రామీణ భారతానికి బడ్జెట్‌లో ప్రాధాన్యత దక్కలేదని చెప్పారు. ఆయుష్మాన్‌ భారత్‌కు గత బడ్జెట్‌లో రూ. 6 500 కోట్ల కేటాయింపులు చేసి రూ.3300 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారని తెలిపారు. వాస్తవానికి బడ్జెట్‌ ప్రతిఫలాలు పొందాల్సింది పేదలని, కానీ వారికి సానుకూలంగా ఒక్క ప్రతిపాదన కూడా లేదని విమర్శించారు. దీన్నిబట్టి ఇది పేదల వ్యతిరేక ప్రభుత్వమని స్పష్టమవుతోందన్నారు. కాంగ్రెస్‌ పాలనలో 8 శాతంగా ఉన్న గ్రోత్‌ రేట్‌.. ప్రస్తుతం 5 శాతానికి పడిపోయిందని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం