కవిత కాంగ్రెస్ కోవర్ట్ : బండా నరేందర్ రెడ్డి

కవిత కాంగ్రెస్ కోవర్ట్ : బండా నరేందర్ రెడ్డి
  • నల్గొండ మాజీ జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు : ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కవిత కాంగ్రెస్ పార్టీ కోవర్ట్ గా మారి, బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, జగదీష్ రెడ్డిలను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారని మాజీ జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి విమర్శించారు. ఆదివారం నల్గొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  మాజీ సీఎం కేసీఆర్ కూతురనే  మమకారంతో కవిత ఏమి మాట్లాడినా బీఆర్ఎస్ నాయకులు ఓపిక పట్టారని, బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని ఆమెను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని  హెచ్చరించారు.  ఆమె నోరు అదుపులో పెట్టుకోవాలని లేకుంటే బీఆర్‌‌ఎస్ నాయకుల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు.  కవిత లిక్కర్ స్కాం తోనే బీఆర్ఎస్ పార్టీకి చెడ్డ పేరు వచ్చిందన్నారు. 

 కాంగ్రెస్ పార్టీ పంచన చేరి కవిత బీఆర్ఎస్ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా కర్మ రిటర్న్ బ్యాక్ అంటూ ట్వీట్ చేస్తున్నారని విమర్శించారు.  మాజీ మంత్రి హరీశ్ రావు 2001 నుంచి నిఖార్సయిన ఉద్యమకారుడిగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ రాష్ట్ర సాధన పోరాటం చేశారన్నారు.  హరీశ్ రావు క్యారెక్టర్ పై కవిత సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.  హరీశ్ రావు పోరాటం చేస్తున్నప్పుడు కవిత ఎక్కడో విదేశాల్లో ఉందన్నారు. 

ఇప్పుడు కవితకు కాంగ్రెస్ పార్టీ వాళ్లు మంచి వారయ్యారని, బీఆర్‌‌ఎస్ నాయకులు చేదయ్యారని విమర్శించారు.  సీఎం రేవంత్ రెడ్డి ఏజెంట్‌గా  కవిత వ్యవహరిస్తుందని విమర్శించారు.  హరీశ్ రావుని ఒంటరి చేయాలని కుట్రలు చేస్తోందని విమర్శించారు.  జాగృతి జనం బాట కార్యక్రమంలో జాగృతి నాయకులు ఎవరు లేకుండా కాంగ్రెస్ పార్టీని మెచ్చుకుంటూ, బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేయడం తగదన్నారు. ఎమ్మెల్సీ కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామాను ఆమోదింపజేసుకోవాలని కోరారు.  

కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని హితవు పలికారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వాపును చూసి బలుపుగా అనుకుంటున్నారని విమర్శించారు.  రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ కు ప్రజల గుణపాఠం చెప్తారని డిపాజిట్లు కూడా రావన్నారు. సమావేశంలో బీఆర్‌‌ఎస్ నాయకులు నిరంజన్ వలి, మాలే శరణ్య రెడ్డి, మందడి సైదిరెడ్డి, సత్యనారాయణ, శ్రీనివాస్, శ్రీనివాస్, జమాల్ ఖాద్రి, యాదయ్య, యుగంధర్ రెడ్డి,  వెంకన్న, జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.