
కాగజ్‌నగర్, వెలుగు : సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ఆసిఫాబాద్‌జిల్లా కాగజ్‌నగర్‌లో మంగళవారం రైతులు ఆందోళనకు దిగారు. యూరియా కోసం రైతులు ఉదయమే వ్యవసాయ సహకార సంఘం వద్దకు చేరుకున్నారు. ఆఫీస్ ఓపెన్ చేయకపోవడంతో ఆగ్రహించిన రైతులు అగ్రికల్చర్ మార్కెట్ ఎదుట మెయిన్‌రోడ్డుపై బైఠాయించారు.
రైతుల ధర్నాతో ఇరువైపులా వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న డీఎస్పీ వహీదుద్దీన్ ఘటనాస్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు. అక్కడి నుంచి మార్కెట్ యార్డ్‌కు చేరుకొని వ్యవసాయ అధికారిని నిలదీశారు. రెండు రోజుల్లో స్టాక్ వస్తుందని.. రాగానే పంపిణీ చేస్తామని అగ్రికల్చర్ ఆఫీసర్ రామకృష్ణ చెప్పారు.
గజ్వేల్‌లో చెప్పులతో కొట్టుకున్న మహిళలు
గజ్వేల్, వెలుగు : యూరియా పంపిణీ కోసం గజ్వేల్ మార్కెట్‌లో టోకెన్లు ఇస్తున్నట్లు తెలియడంతో మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయమే మార్కెట్ వద్దకు చేరుకున్న మహిళలు గంటల తరబడి క్యూలో నిల్చున్నారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళల మధ్య గొడవ జరగడంతో.. మాటామాట పెరిగి ఒకరికొకరు చెప్పులతో కొట్టుకున్నారు. గమనించిన మిగతా మహిళలు వారిని అడ్డుకొని పక్కకు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మహిళలకు నచ్చజెప్పారు.
ఇదిలా ఉండగా.. శుక్రవారం ఒక్క రోజే 1,500 మందికి ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేసేందుకు ఆఫీసర్లు టోకెన్లు అందజేశారు. వీరికి శుక్రవారం పట్టణంలోని వివిధ షాపుల్లో యూరియా బస్తాలు ఇస్తామని గజ్వేల్ ఏడీఏ బాబునాయక్ తెలిపారు. గురువారం రాత్రి స్టాక్ వస్తుందని, శుక్రవారం పంపిణీ చేస్తామని చెప్పారు.