
- ఉదయం ఫ్రీ ప్రాక్టీస్ 2, క్వాలిఫయింగ్ రౌండ్
- మ. 3 నుంచి మెయిన్ రేస్
- స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 2, హాట్ స్టార్‌లో లైవ్
రేస్ షెడ్యూల్
ఫ్రీ ప్రాక్టీస్ రేస్2: ఉ. 8.05 నుంచి 8.55
క్వాలిఫయింగ్ రేస్: ఉ. 10.40 నుంచి 11.55
మెయిన్ రేస్: మ. 3.05 నుంచి 4.30
హైదరాబాద్, వెలుగు: ఇండియాలో రేసింగ్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. మన హైదరాబాద్ మరో హిస్టారికల్ ఈవెంట్‌కు రెడీ అయింది. ప్రతిష్టాత్మక ఫార్ములా-–ఈ రేస్‌కు ఆతిథ్యం ఇచ్చిన ఇండియా తొలి సిటీగా భాగ్యనరం చరిత్రకెక్కనుంది. ఫార్ములా–ఈ చాంపియన్‌షిప్ తొమ్మిదో సీజన్‌లోని నాలుగో రౌండ్ రేస్ హుస్సేన్‌సాగర్ సమీపంలో ఏర్పాటు చేసిన 2.83 కి.మీ హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్‌పై శనివారం జరగనుంది. జెన్3 ఎలక్ట్రిక్ కార్లు గంటకు 200 నుంచి 322 కి.మీ. స్పీడ్ వరకూ దూసుకెళ్లనున్నాయి. ఈ రేసులో 11 జట్లకు చెందిన 22 మంది రేసర్లు పోటీ పడతారు. ఇందులో ఇండియాకు చెందిన మహీంద్రా రేసింగ్ టీమ్ కూడా ఉంది.2013లో గ్రేటర్ నోయిడాలో ఫార్ములా–1 రేస్ ఆగిపోయిన తర్వాత ఇండియాలో జరుగుతున్న తొలి ఫార్ములా ఈవెంట్ ఇదే కావడం విశేషం. ఇక, వరల్డ్ వైడ్ ఫార్ములా–ఈ చాంపియన్‌షిప్‌నకు ఆతిథ్యం ఇస్తున్న 27వ నగరంగా హైదరాబాద్ నిలవనుంది.
45 నిమిషాలు.. 32 ల్యాప్స్
ట్రాక్, వాతావరణం ఎలా ఉందని తెలుసుకునేందుకు శుక్రవారం సాయంత్రం రేసర్లంతా ఫ్రీ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. శనివారం మరో ప్రాక్టీస్ తర్వాత క్వాలిఫయింగ్ రౌండ్ ద్వారా పోల్ పొజిషన్ (కార్ల వరుస క్రమం) తేలుస్తారు. అనంతరం 45 నిమిషాల పాటు మెయిన్ రేసు నిర్వహిస్తారు. ఈ సమయంలో18 మలుపులతో ఉన్న హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్‌లో 32 ల్యాప్స్ (ట్రాక్‌ను ఒకసారి చుట్టొస్తే ఒక ల్యాప్) జరుగుతాయి. 45 నిమిషాల తర్వాత విన్నర్‌ను తేల్చేందుకు మరో ల్యాప్ నిర్వహిస్తారు. తక్కువ సమయంలో రేసును పూర్తి చేసిన వారు రౌండ్4 విన్నర్ అవుతాడు. అతనికి 25 పాయింట్లు దక్కుతాయి. తొలి పది స్థానాల్లో నిలిచిన వారికే పాయింట్లు లభిస్తాయి. ఈ రేసులో నిర్ణీత సమయంలో అటాక్ మోడ్ యాక్టివేట్ చేస్తారు. అప్పుడు కార్లకు మరో 35 కేవీ ఎనర్జీ వచ్చి మరింత వేగంగా దూసుకెళ్తాయి. ఎప్పుడు, ఎన్ని అటాక్ మోడ్స్ ఇవ్వాలన్నది రేసుకు ముందు నిర్ణయిస్తారు.