ఒమిక్రాన్ ఫేక్ సర్టిఫికెట్.. నలుగురు అరెస్ట్​

ఒమిక్రాన్ ఫేక్ సర్టిఫికెట్.. నలుగురు అరెస్ట్​

అసలే కరోనా వార్తలతో ఆందోళన చెందుతున్న జనాలకు మరో షాక్ ఇచ్చారు కేటుగాళ్లు.. అన్నింట్లోనూ నకిలీ సృష్టిస్తూ తాజాగా ఒమిక్రాన్ రిపోర్టును కూడా తారు మారు చేశారు. సర్టిఫికెట్ ను పరిశీలించిన అధికారులు నకిలీదని తేలడంతో ముక్కున వేలేసుకున్నారు. విషయానికి వస్తే..  సౌతాఫ్రికాకు చెందిన వ్యక్తి ఇండియా నుంచి తిరిగి వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న  ఎయిర్ పోర్టుల్లో కరోనా టెస్టులు కంపల్సరీ చేసింది కేంద్రం. అయితే సౌతాఫ్రికాకు వెళ్లేందుకు బెంగళూరు ఎయిర్ పోర్టుకు వచ్చిన వ్యక్తికి టెస్టులు చేయగా కరోనా పాజిటివ్​ వచ్చింది. ఒమిక్రాన్ లక్షణాలు ఉండటంతో శాంపిళ్లను ల్యాబ్ కు పంపి టెస్టులు చేయించగా పాజిటివ్​  వచ్చింది. అయితే అదే వ్యక్తి ఒమిక్రాన్ టెస్టులో నెగిటివ్ రిపోర్టు వచ్చినట్లు సర్టిఫికెట్​ చూపడంతో అధికారులు షాక్ అయ్యారు. అనుమానం వచ్చి పోలీసులు విచారణ చేయగా.. సర్టిఫికెట్ నకిలీదని తేలింది. కేసు నమోదు చేసి, కర్నాటకకు  చెందిన  నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. దేశంలో నమోదైన తొలి ఒమిక్రాన్ కేసు బాధితుడు ఇతనే కావడం విడ్డూరం. వారం రోజుల క్వారంటైన్ లో ఉన్న ఒమిక్రాన్ బాధితుడు.. దుబాయ్ మీదుగా స్వదేశానికి వెళ్లాలనే ప్రయత్నంలో నకిలీ సర్టిఫికెట్ తయారు చేయించుకున్నట్లు అధికారులు తెలిపారు.