గతంలో వాడిన రాకెట్​తో స్పేస్​కు నలుగురు ఆస్ట్రోనాట్లు

గతంలో వాడిన రాకెట్​తో స్పేస్​కు నలుగురు ఆస్ట్రోనాట్లు
  • అదే రాకెట్​తో మళ్లీ నింగికి
  • నాసా, స్పేస్ ఎక్స్ ‘ఫస్ట్ రీయూజ్డ్ రాకెట్’ ప్రయోగం సక్సెస్

కేప్ కేనవెరాల్: ఆస్ట్రోనాట్లను అంతరిక్షానికి పంపాలంటే ఇప్పటిదాకా ఒక రాకెట్ ను ఒక్కసారి మాత్రమే వాడేందుకు చాన్స్ ఉండేది. ఇకపై ఒకసారి వాడిన రాకెట్ ను రెండోసారి కూడా వాడుకోవచ్చు. ఈ దిశగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ ‘స్పేస్ ఎక్స్’ కీలక విజయం సాధించాయి. తొలిసారిగా రీయూజ్డ్ రాకెట్ తో నలుగురు ఆస్ట్రోనాట్లను నింగికి పంపి హిస్టరీ క్రియేట్ చేశాయి. శుక్రవారం ఉదయం 5.49 గంటలకు అమెరికా ఫ్లోరిడా స్టేట్ లోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం విజయవంతంగా జరిగింది. స్పేస్ లోకి చేరగానే ఆస్ట్రోనాట్లు ఉన్న డ్రాగన్ క్యాప్సూల్ ఉదయం 6 గంటలకు రాకెట్ నుంచి విడిపోయి ఐఎస్ఎస్ దిశగా ప్రయాణం ప్రారంభించింది. శనివారం ఉదయం 5 గంటలకు వీరు ఐఎస్ఎస్ ను చేరుకుంటారు. ప్రస్తుతం డ్రాగన్ క్యాప్సూల్ భూమి చుట్టూ తిరుగుతోందని అధికారులు తెలిపారు. ఈ మిషన్ లో నాసాకు చెందిన షేన్ కింబ్రో, మేగన్ మెక్ ఆర్థర్, జపాన్​కు చెందిన హోషిడే, ఫ్రాన్స్ కు చెందిన పీస్కెట్ ఉన్నారు.

రెండోసారి.. రాకెట్, మాడ్యూల్

ఈ ప్రయోగంలో ఉపయోగించిన ఫాల్కన్ 9 రాకెట్ ను, క్రూ (డ్రాగన్) మాడ్యూల్ ను ఇంతకుముందే స్పేస్ఎక్స్ క్రూ1 మిషన్ లో వాడారు. గతేడాది  మేలో  జరిగిన ఆ మిషన్ లో మాడ్యూల్ ను నింగికి చేర్చి కిందికి వచ్చిన రాకెట్ సేఫ్​గా ల్యాండ్ అయింది. ఆస్ట్రోనాట్లను ఐఎస్ఎస్ (ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్)కు చేర్చిన మాడ్యూల్, ఇతర ఆస్ట్రోనాట్లతో తిరిగి భూమికి వచ్చింది. ఆ రాకెట్ ను, మాడ్యూల్ ను మళ్లీ సిద్ధం చేసి, తాజాగా మరోసారి నలుగురు ఆస్ట్రోనాట్లను నింగికి పంపారు. ఇందులోనూ మాడ్యూల్ ను నింగికి చేర్చిన రాకెట్ లోని ఫస్ట్ స్టేజ్ మళ్లీ కిందికి వచ్చి సేఫ్ గా ల్యాండ్ అయింది. దీనిని మరో మిషన్ లో మళ్లీ వాడుకునేందుకు అవకాశం ఉంది. ఇలా రాకెట్ ను, మాడ్యూల్ ను మళ్లీ వాడుకోవడంతో  ఖర్చు, సమయం, శ్రమ ఆదా కానున్నాయి.