సీఎం రేవంత్ రెడ్డిని వెయ్యిసార్లు కలుస్తం : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

సీఎం రేవంత్ రెడ్డిని  వెయ్యిసార్లు కలుస్తం :   బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
  • ఆయనను కలిసేందుకు ఎక్కడికైనా పోతం: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
  • ప్రొటోకాల్ సమస్యలు, నియోజకవర్గాల అభివృద్ధి పనుల కోసమే కలిసినం
  • ముఖ్యమంత్రిని కలిసినంత మాత్రాన పార్టీ మారుతున్నట్టు కాదు
  • కాంగ్రెస్​లో చేరే ప్రసక్తే లేదు.. మాపై కేసీఆర్​కు నమ్మకం ఉంది 
  • కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు వెల్లడి 

హైదరాబాద్, వెలుగు:  సీఎం రేవంత్‌‌‌‌రెడ్డిని వెయ్యిసార్లు కలుస్తామని.. ఆయనను కలిసేందుకు ఎప్పుడైనా, ఎక్కడికైనా పోతామని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు అన్నారు. తమ నియోజకవర్గాల అభివృద్ధి పనుల గురించి ముఖ్యమంత్రిని కలిసినంత మాత్రాన పార్టీ మారుతున్నట్టు కాదని, తాము బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. ప్రొటోకాల్ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు, అభివృద్ధి పనులపై విన్నవించేందుకు ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌‌‌‌‌‌‌‌రెడ్డిని, సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డిని కలిశామని తెలిపారు. బుధవారం తెలంగాణ భవన్‌‌‌‌లో నలుగురు ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. తమను అప్రతిష్టపాలు చేసేందుకు పార్టీ మారుతున్నట్టుగా ప్రచారం చేస్తున్నారని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ‘‘బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ అధిష్టానానికి మా మీద నమ్మకం ఉంది. మా నాయకుడు కేసీఆర్ మీద మాకు నమ్మకం ఉంది. పార్టీ మారే ప్రసక్తే లేదు” అని  ఆమె పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో మెదక్ లోక్ సభ స్థానంలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ను గెలిపించుకుంటామన్నారు. హామీల అమలుపై కాంగ్రెస్ కప్పదాటు వైఖరి ప్రదర్శిస్తోందని, చాలా అంశాల్లో ప్రభుత్వానికి స్పష్టత లేదని విమర్శించారు. మహాలక్ష్మి, యువ వికాసం గ్యారంటీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. తన నియోజకవర్గంలో ప్రొటోకాల్ వివాదాలపై ఇంతకుముందే మీడియాకు వెల్లడించానని, ఇప్పుడదే విషయమై చర్చించేందుకు సీఎంను కలిశామని పేర్కొన్నారు. తాము పార్టీ మారుతున్నామంటూ కొంతమంది కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారని, ఇది ఇలాగే కొనసాగితే పరువునష్టం కేసులు పెడ్తానని హెచ్చరించారు. 

బతికున్నంతకాలం బీఆర్ఎస్​లోనే: మహిపాల్ 

స్థానిక సమస్యలపై కలెక్టర్‌‌‌‌, ఎస్పీని ఇదివరకే కలిశామని.. దీనికి కొనసాగింపుగానే ఇంటెలిజెన్స్‌‌‌‌ చీఫ్​శివధర్‌‌‌‌‌‌‌‌రెడ్డిని కలిశామని గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. తాను బతికున్నంతకాలం బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లోనే ఉంటానని చెప్పారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి, తమ రాజకీయాలకు  సంబంధం లేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ముఖ్యమంత్రిని కలిశామని మాణిక్‌‌‌‌రావు అన్నారు. ‘‘కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు జహీరాబాద్ కు సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ పథకాలు మంజూరు చేశారు. ఆ పనులను ఆపాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అలా చేయొద్దని సీఎం రేవంత్‌‌‌‌కు విజ్ఞప్తి చేశాం. ప్రొటోకాల్, సెక్యూరిటీ, నియోజకవర్గానికి నిధుల కేటాయింపు అంశాలపై విన్నవించాం” అని పేర్కొన్నారు.

కాంగ్రెస్.. ఎండ్రికాయల పార్టీ: ప్రభాకర్ రెడ్డి   

కాంగ్రెస్.. ఓ ఎండ్రికాయల పార్టీ అని, అందులో తాము ఎందుకు చేరుతామని కొత్త ప్రభాకర్‌‌‌‌ ‌‌‌‌రెడ్డి అన్నారు. ‘‘రేవంత్‌‌‌‌ రెడ్డి కాంగ్రెస్‌‌‌‌ ముఖ్యమంత్రి కాదు. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. నా నియోజకవర్గంలో మంత్రి కార్యక్రమానికి కూడా నన్ను ఆహ్వానించడం లేదు. ఎమ్మెల్యేగా ఉన్న నాకు సరైన భద్రత కూడా కల్పించడం లేదు. ఈ విషయాలపై ఫిర్యాదు చేసేందుకే సీఎంను కలిశాం. ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రధాని మోదీని రేవంత్‌‌‌‌ కలిసినట్టే.. మా నియోజకవర్గాల అభివృద్ధి గురించి మేం సీఎం రేవంత్‌‌‌‌ను కలిశాం. నేను బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లో మొదట్నుంచి ఉన్నాను. ఇకపై కూడా బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లోనే ఉంటాను” అని చెప్పారు. కాంగ్రెస్‌‌‌‌ నేతలు తమపై విమర్శలు చేయడం మానేసి, ఇచ్చిన గ్యారంటీల అమలుపై దృష్టిసారించాలని అన్నారు. ‘రైతుబంధు రాదు అనే వారిని చెప్పుతో కొట్టాలి’ అని మంత్రి కోమటిరెడ్డి అంటున్నారని.. ఇదేనా సంస్కా రం అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.