హుజురాబాద్ టీఆర్ఎస్ టికెట్ కోసం నలుగురు

V6 Velugu Posted on Aug 01, 2021

  • వారి ప్లస్‌‌లు, మైనస్‌‌లపై సర్వేల మీద సర్వేలు
  • రేసులో ఎల్​.రమణ, గెల్లు శ్రీనివాస్‌‌, పి. మల్లయ్య, కౌశిక్‌‌ రెడ్డి
  • రమణకు టికెట్‌‌ ఇవ్వాల్సి వస్తే ముందుగా కేబినెట్‌‌లో చాన్స్​!

హైదరాబాద్‌‌, వెలుగు: హుజూరాబాద్‌‌  టీఆర్‌‌ఎస్‌‌  టికెట్‌‌  రేసులో ముగ్గురు బీసీలు, ఒక రెడ్డి నిలిచారు. ఈ నలుగురి ప్లస్‌‌లు, మైనస్‌‌లపై సీఎం కేసీఆర్​ ఫోకస్​ పెట్టారు. ఇంటెలిజెన్స్‌‌తో పాటు వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరిస్తూ ఎవరికి టికెట్‌‌ ఇస్తే పార్టీకి ఉపయోగకరమో లెక్కలు వేసుకుంటున్నారు. హుజూరాబాద్‌‌  ఉప ఎన్నికను సీరియస్‌‌గా తీసుకున్న కేసీఆర్‌‌ అన్నీ తానై ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌‌ రాజీనామా చేసిన రోజు నుంచి టీఆర్​ఎస్​ టికెట్​ కోసం పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నా ఇప్పుడు నలుగురు మాత్రమే రంగంలో ఉన్నారు. మాజీ మంత్రి ఎల్‌‌.రమణ, టీఆర్‌‌ఎస్​వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌‌, జమ్మికుంట మాజీ సర్పంచ్‌‌ పొనగంటి మల్లయ్య, కాంగ్రెస్‌‌ నుంచి ఇటీవల టీఆర్‌‌ఎస్‌‌లో చేరిన పాడి కౌశిక్‌‌రెడ్డి పేర్లు కేసీఆర్‌‌ పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. 

చేనేతల సంక్షేమానికి అనేక పథకాలు చేపట్టబోతున్నట్టు ప్రకటించిన కేసీఆర్.. పద్మశాలి కులానికి చెందిన ఎల్​.రమణను పోటీకి దించడంపై అనేక లెక్కలు వేసుకుంటున్నారు. రమణకు టికెట్‌‌  ఇవ్వాలనుకుంటే అంతకుముందే ఆయనను కేబినెట్‌‌లోకి తీసుకొని పోటీకి దించవచ్చని తెలుస్తోంది. ఒకవేళ స్థానికుడికే టికెట్‌‌ ఇవ్వాలనుకున్నట్లయితే  రమణను మండలికి పంపుతారని సమాచారం. యాదవ కులానికి చెందిన టీఆర్‌‌ఎస్‌‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌‌ పేరుపైనా తీవ్ర కసరత్తు కొనసాగుతోంది. మొదటి నుంచి విద్యార్థి విభాగంలో పనిచేస్తున్న గెల్లు శ్రీనివాస్‌‌ కేసీఆర్‌‌ కుటుంబానికి నమ్మకస్తుడు. గెల్లుకు టికెట్‌‌ ఇవ్వడం ద్వారా స్టూడెంట్లు, యువతకు పార్టీ ప్రాధాన్యం ఇచ్చినట్టు అవుతుందనే కోణంలోనూ ఆలోచన చేస్తున్నారు. మున్నూరుకాపు కులానికి చెందిన జమ్మికుంట మాజీ సర్పంచ్‌‌  పొనగంటి మల్లయ్య పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఈయనకు టికెట్‌‌ ఇవ్వాలని ఓ మంత్రి లాబీయింగ్‌‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. మల్లయ్యకు టికెట్‌‌ ఇస్తే ఎలా ఉంటుందని కేసీఆర్‌‌ ఆరా తీస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ అభ్యర్థిగా రంగంలోకి దిగి ఈటలకు పోటీ ఇచ్చిన కౌశిక్‌‌రెడ్డికి టికెట్‌‌ ఇవ్వడంపైనా పలు అంశాలను బేరీజు వేసుకుంటున్నారు. ఈ నలుగురి పేర్లతో ఇప్పటికే సర్వే చేయించిన కేసీఆర్‌‌ ఎవరెవరిపై ప్రజాభిప్రాయం ఎలా ఉందని సమీక్షిస్తున్నారు. స్థానికంగా మైనస్‌‌లు ఎక్కువగా లేని వ్యక్తికి టికెట్‌‌ ఖరారు చేసే అవకాశమున్నట్టు టీఆర్​ఎస్​ వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికల వ్యవహారాలను మంత్రులు చూస్తున్నా అభ్యర్థి ఎంపిక కేసీఆర్‌‌ కనుసన్నల్లోనే జరగుతోంది. ఈ నలుగురి పేర్లతోనే మరికొన్ని సర్వేలు చేసి టికెట్‌‌ ఖరారు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అభ్యర్థిని ఫైనల్‌‌ చేసినా ఎన్నికల నోటిఫికేషన్‌‌ వచ్చి, నామినేషన్ల ప్రక్రియ మొదలైన తర్వాతే అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం.
 

Tagged TRS, contest, L.Ramana, Four candidates, Huzurabad ticket, koushikreddy

Latest Videos

Subscribe Now

More News