మంత్రిని అడ్డుకోబోయిన నలుగురు రైతుల అరెస్ట్... వారిపై నాన్ బెయిలబుల్  కేసులు 

మంత్రిని అడ్డుకోబోయిన నలుగురు రైతుల అరెస్ట్... వారిపై నాన్ బెయిలబుల్  కేసులు 

  యాదాద్రి, వెలుగు : మంత్రి గుంటకండ్ల జగదీశ్​ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేసినందుకు యాదాద్రి జిల్లాకు చెందిన నలుగురు రైతులను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై నాన్​బెయిలబుల్​​ కేసులు నమోదు చేశారు.  మంగళవారం అర్ధరాత్రి వారిని కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్​కు తరలించారు. ఇదంతా గంటల వ్యవధిలోనే జరిగిపోయింది. ట్రిపుల్ ఆర్​ కారణంగా యాదాద్రి జిల్లాలోని ఆలేరు, భువనగిరి, మునుగోడు నియోజవర్గాల్లోని ఐదు మండలాలకు చెందిన రైతులు తమ భూములను కోల్పోతున్నారు. దీంతో అలైన్​మెంట్​ మార్చాలని డిమాండ్​ చేస్తూ రైతులు ఆందోళన చేస్తున్నారు. ఆందోళనల్లో భాగంగా యాదాద్రి కలెక్టరేట్​ వద్ద రెండు రోజుల పాటు ధర్నా నిర్వహించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై రివ్యూ చేయడానికి మంత్రి జగదీశ్​ రెడ్డి మంగళవారం యాదాద్రి కలెక్టరేట్ కు​వచ్చారు. తిరిగివెళ్లే సమయంలో మంత్రి కాన్వాయ్​ను అడ్డుకునేందుకు రైతులు ప్రయత్నించారు. భూములు పోతున్నాయన్న ఆగ్రహంతో ఉన్న రైతులు తమ వెంట తెచ్చిన ఎండుగడ్డి మోపుకు నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. 

పోలీస్  ఎస్కార్ట్  వాహనం డ్యామేజ్  అంట

మంత్రిని రైతులు అడ్డుకునే ప్రయత్నం చేయడాన్ని పోలీసులు సీరియస్​గా తీసుకున్నారు. సంఘటన జరిగిన వెంటనే ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్​ స్టేషన్లకు తరలించారు. ఆ తర్వాత ఎలాంటి పరిణమాలూ జరిగాయో తెలియదు గానీ భువనగిరి రూరల్​ పీఎస్​ హెడ్ కానిస్టేబుల్​ ఎస్​ నారాయణ రెడ్డి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మరో నలుగురు కానిస్టేబుళ్లను సాక్షులుగా పేర్కొన్నారు. ట్రిపుల్​ ఆర్​ పేరుతో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించారని ఎఫ్ఐఆర్​లో పేర్కొన్నారు. వెంట తెచ్చిన ఎండుగడ్డికి నిప్పు పెట్టడంతో పాటు కలెక్టరేట్​ పోలీస్ సెంట్రీ పోస్ట్​ను కాల్చే ప్రయత్నం చేశారంటూ పేర్కొన్నారు. దీంతో పోలీస్ ఎస్కార్ట్​​ వెహికల్​ డ్యామెజీ అయిందని ఆరోపించారు. బాధితుల్లో గడ్డమీది మల్లేశ్, పల్లెర్ల యాదగిరి, అవిశెట్టి నిఖిల్, మల్లెబోయిన బాలును మంగళవారం సాయంత్రమే అరెస్టు​చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం అర్ధరాత్రి రిమాండ్​కు తరలించారు. ఈ ఆందోళనలో పాల్గొన్న బీజేపీ స్టేట్​ లీడర్​ గూడూరు నారాయణరెడ్డి, కాంగ్రెస్​ లీడర్​ తంగెళ్లపల్లి రవికుమార్ పైనా కేసు నమోదు చేశారు.