కానిస్టేబుల్ టు SI .. 4 జాబులు సాధించాడు

కానిస్టేబుల్ టు SI .. 4 జాబులు సాధించాడు

నాన్నకు తాను పోలీస్‌‌గా కనబడాలని ఎన్నో కలలు కన్నాడు. తీరా ఖాకీ చొక్కా వేసేనాటికి ఆయన కాలం చేశారు. అప్పటి నుంచి తండ్రి  బాధ్యతలు తన భుజాలకెత్తుకున్నాడు. ఇద్దరు చెల్లెళ్ల పెళ్లి చేశాడు. ఇంకా పెద్ద ఉద్యోగం సంపాదించాలనుకున్న తన కలను నెరవేర్చుకున్నాడు. సివిల్ కానిస్టేబుల్‌‌గా మొదలైన తన ప్రయాణాన్ని సివిల్ ఎస్‌‌ఐ వరకు తీసుకొచ్చాడు. ఈ మధ్యలోనే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులు వచ్చాయంటున్నాడు ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని తవిసీబోడు తండాకు చెందిన జర్పల దేవ్‌‌సింగ్.

2016లో మిస్సయింది..

ఉన్న ఒక్కగానొక్క కొడుకుని అగర్తలా పంపించే ఉద్దేశం మా అమ్మకు లేదు. నాన్న బాధ్యతల్ని నేను తీసుకోవాలని డిసైడయ్యా. అందుకే ఎంటెక్ ఆలోచన మానేసి సివిల్ కానిస్టేబుల్‌‌గా డ్యూటీ చేయడం ప్రారంభించా. పనిచేస్తూనే ఎస్‌‌ఐ నోటిఫికేషన్ వస్తే రాస్తూనే ఉన్నా. అలా 2016లో ఎస్‌‌ఐ జాబ్ కొద్దిపాటి తేడాతో మిస్సయింది. అయినా చదవడం మాత్రం ఆపలేదు. జాబ్‌‌కు వెళ్లొచ్చాక ఫోన్ స్విచ్ఛాప్‌‌ చేసేవాణ్ని. అప్పుడు పుస్తకం పట్టుకుంటే 6 నుంచి 8 గంటలు చదివా. ఏ రోజూ ఇవాళ అలసిపోయాను పడుకుందాంలే అనుకోలేదు.

అనుకోకుండానే వచ్చాయి..

బీటెక్ బ్యాక్‌‌గ్రౌండ్ అయినా సొసైటీ గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువ. అందుకే పాలిటీ, హిస్టరీ, సోషియాలజీ సబ్జెక్టులను చాలా ఈజీగా చదివేశా. ఒకదానికొకటి లింక్ చేసుకుంటూ ప్రిపేరయ్యా. ఇలా ప్రిపేరయ్యే టైంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, జూనియర్ పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్లు వచ్చాయి. నేను కాంపిటీటివ్ వే లోనే పోతున్నానా లేదా అని టెస్ట్ చేసేందుకు ఆ రెండు పరీక్షలు రాశా. అవి రావడంతో నా కాన్ఫిడెన్స్ పెరిగింది. అదే ఉత్సాహంతో 2018 ఎస్‌‌ఐ నోటిఫికేషన్‌‌కు ప్రిపేరయ్యా.

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సివిల్ కానిస్టేబుల్ సేమ్ కేడర్ కావడంతో సివిల్‌‌ కానిస్టేబుల్‌‌గానే ఉండిపోయా. ప్రస్తుతం కొత్తగూడెం డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్‌‌లో డ్యూటీ చేస్తున్న. ఫ్యూచర్‌‌‌‌లో గ్రూప్‌‌–1 రాయాలనుకుంటున్నా. దానికి కూడా ఇలాగే జాబ్ చేసుకుంటూ ప్రిపేరవుతా. జాయింట్ కలెక్టర్ జాబ్ కొట్టాలనే నా కలను నిజం చేసుకుంటా.

– కారేపల్లి, వెలుగు

ఆ సంవత్సరం మార్చేసింది..

2012 సంవత్సరం నా జీవితంలో కీలకం. ఆ సంవత్సరంలో నేను ఊహించనవన్నీ జరిగాయి. అప్పుడే బీటెక్ పూర్తి చేసిన నాకు ఎన్‌‌ఐటీ అగర్తలాలో ఎంటెక్ సీటొచ్చింది. 50వేలు వెంటనే డిపాజిట్ చేయాలంటే ఎలా ఇబ్బంది పడుతుండగా సివిల్ కానిస్టేబుల్ జాబొచ్చింది. తీరా జాబ్‌‌లో జాయిన్ అయ్యే నాటికి నాన్న చనిపోయారు. ఇలా నేను ఏం చేయాలో ఏం చేస్తున్నానో తెలుసుకునేలోపే జరగాల్సినవన్నీ జరిగిపోయాయి.