అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన నలుగురు ఇండియన్స్

అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన నలుగురు ఇండియన్స్

వాషింగ్టన్: అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్లు సత్తా చాటారు. ఈ ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడ్డాయి. డెమోక్రటిక్ పార్టీ నుంచి నలుగురు ఇండియన్ అమెరికన్లు ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. వారిలో రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, ప్రమీలా జయపాల్ మళ్లీ ఎన్నికవగా ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ తానేదార్ మొదటిసారిగా ఈ ఎన్నికల్లో గెలుపొందారు. మిషిగాన్ నుంచి తానేదార్ (67) తన రిపబ్లికన్ అభ్యర్థి మార్టెల్ బివింగ్స్ పై విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన మిచిగాన్ హౌస్ లో మూడో జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఇల్లినాయిస్ లోని ఎనిమిదో కాంగ్రెషనల్  జిల్లాలో  రాజా కృష్ణమూర్తి (49) రిపబ్లికన్ ప్రత్యర్థి క్రిస్​డార్గిస్ పై విజయం సాధించారు. కాలిఫోర్నియాలో 17వ కాంగ్రెషనల్ జిల్లాలో రో ఖన్నా (46) రిపబ్లికన్ అభ్యర్థి రితేష్​ టాండన్ పై గెలుపొందారు. ఇక ప్రమీలా జయపాల్ వాషింగ్టన్ లోని ఏడో కాంగ్రెషనల్ జిల్లాలో తన ప్రత్యర్థి క్లిఫ్ మూన్ పై విజయం సాధించారు. ఖన్నా, కృష్ణమూర్తి, జయపాల్ వరుసగా నాలుగోసారి విజయం సాధించడం విశేషం.

కాలిఫోర్నియాలో ఏడో కాంగ్రెషనల్ జిల్లాలో మరో ఇండియన్ అమెరికన్ అమీ బేరా (57) పోటీచేశారు. ఆ ఎన్నిక ఫలితం రావాల్సి ఉంది. ఇక మేరీలాండ్ లో లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి పోటీచేసిన ఇండియన్ అమెరికన్ అరుణా మిల్లర్ (58) ఆ పదవికి ఎన్నికై చరిత్ర సృష్టించారు. కాగా టెక్సస్ లోని మూడో కాంగ్రెషనల్ జిల్లాలో పోటీచేసిన సందీప్ శ్రీవాస్తవ తన ప్రత్యర్థి కీథ్ సెల్ఫ్ చేతిలో ఓడిపోయారు.