పుంజుకుంటున్న ఐపీఓ మార్కెట్

 పుంజుకుంటున్న ఐపీఓ మార్కెట్

న్యూఢిల్లీ: ఈ ఏడాదంతా డల్‌గా ఉన్న ఐపీఓ మార్కెట్ తిరిగి పుంజుకుంటున్నట్టు కనిపిస్తోంది. వచ్చే వారం ఇన్వెస్టర్ల ముందుకు వచ్చేందుకు నాలుగు ఐపీఓలు క్యూలో ఉన్నాయి. బెంగళూరు కంపెనీ డీసీఎక్స్ సిస్టమ్స్‌ లిమిటెడ్‌, గ్లోబల్‌ హెల్త్‌, బికజి ఫుడ్స్‌ ఇంటర్నేషనల్‌, ఫ్యూజన్‌ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్‌లు సుమారు రూ. 4,500 కోట్లను పబ్లిక్ ఇష్యూ ద్వారా సేకరించాలని  చూస్తున్నాయి.

డీసీఎక్స్ సిస్టమ్స్‌: డీసీఎక్స్ సిస్టమ్స్‌ ఐపీఓ ఈ నెల 31 న ఓపెన్ అవుతుంది. నవంబర్ 2 న ముగుస్తుంది.  కంపెనీ షేర్లు రూ.197–207 దగ్గర ఐపీఓలో అందుబాటులో ఉంటాయి.  నవంబర్ 7 న షేర్ల అలాట్‌మెంట్‌ ఉండగా, నవంబర్ 11 న కంపెనీ షేర్లు మార్కెట్‌లో లిస్టింగ్ అవుతాయి. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.500 కోట్లు సేకరించాలని డీసీఎక్స్  చూస్తోంది.

ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్‌: ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్ ఐపీఓ నవంబర్ 2 న ఓపెన్ కానుండగా, నవంబర్ 4 న ముగుస్తుంది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,100 కోట్లను సేకరించాలని కంపెనీ టార్గెట్‌గా పెట్టుకుంది. ఐపీఓలో రూ.350–368 వద్ద కంపెనీ షేర్లు అందుబాటులో ఉంటాయి.

గ్లోబల్ హెల్త్ లిమిటెడ్, బికజి ఫుడ్స్‌: మేదాంత బ్రాండ్‌తో హాస్పిటల్స్ నిర్వహిస్తున్న గ్లోబల్ హెల్త్  ఐపీఓ , బికజి ఫుడ్స్ ఇంటర్నేషనల్ ఐపీఓ రెండూ కూడా   వచ్చే నెల 3 న ఓపెన్ అవుతాయి.  నవంబర్‌‌ 7 న ముగుస్తాయి. గ్లోబల్ హెల్త్ షేర్లు రూ. 319–336 దగ్గర ఐపీఓలో అందుబాటులో ఉండగా, ఈ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 2,200 కోట్లను సేకరించాలని కంపెనీ చూస్తోంది. బికజి ఫుడ్స్ షేర్ల ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఇంకా బయటకు రాలేదు. ఈ కంపెనీ ఐపీఓ ద్వారా రూ. 900 కోట్లు సేకరించనుంది.