ఇంట్లో అగ్నిప్రమాదం.. నలుగురు మృతి

ఇంట్లో అగ్నిప్రమాదం.. నలుగురు మృతి
  • మస్కిటో కాయిల్‎తో మంటలు.. నలుగురు సజీవదహనం

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. అగ్నిమాపక శాఖ తెలిపిన వివరాల ప్రకారం..
ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఓల్డ్ సీమాపురి ప్రాంతంలోని ఓ ఇంట్లో మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో ఇంట్లోని మూడో అంతస్తులో నిద్రిస్తున్న.. 58 ఏళ్ల హోరీలాల్, అతని భార్య రీనా(55), కుమారుడు అశు(24), కుమార్తె రోహిణి(18) మంటల్లో చిక్కుకొని ఊపిరాడక చనిపోయారు. ప్రమాద సమయంలో రెండో అంతస్తులో నిద్రిస్తున్న 22 ఏళ్ల అక్షయ్ మృత్యువు నుంచి తప్పించుకున్నాడు. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలానికి చేరుకొని నాలుగు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మస్కిటో కాయిల్ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. తెల్లవారుజామున 3 గంటలకు మంటలు చెలరేగగా.... దాదాపు గంట తర్వాత పక్కింటి వారు మంటలను గుర్తించి ఫైర్ సేఫ్టీ సిబ్బందికి సమాచారం అందించారు. ప్రస్తుతం మృతదేహాలన్నింటినీ పోస్ట్‌మార్టం కోసం తరలించారు. పోలీసులు 436 మరియు 304A సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హోరీలాల్ శాస్త్రి భవన్‌లో నాలుగో తరగతి ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆయన మార్చి 2022లో పదవీ విరమణ చేయవలసి ఉంది. అతని భార్య రీనా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో స్వీపర్‌గా పనిచేస్తోంది. కూతురు రోహిణి సీమాపురిలోని ప్రభుత్వ పాఠశాలలో 12వ తరగతి చదువుతుండగా.. కుమారుడు అశు ఉద్యోగ వేటలో ఉన్నాడు. ప్రాణాలతో బయటపడిన అక్షయ్ ప్రస్తుతం డైలీ వర్కర్‎గా పనిచేస్తున్నాడు.