
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లపల్లి దగ్గర ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాల ట్యాంకర్‌ను కారు ఢీ కొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం మేడూరుకు చెందిన ఆరుగురు తిరుమల శ్రీవారిని దర్శించుకొని ఇవాళ ఉదయం తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డ్రైవర్ సాంబారెడ్డి(44)తో సహా పాండురంగారావు(42), నరసింహారావు(40), సత్యసాగర్ (10) మృతి చెందారు. అనురాధ, సుప్రియ ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన వారిలో డ్రైవర్ మినహా మిగతా వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు.