యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు కార్మికులు మృతి

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు కార్మికులు మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ముందు వెళ్తున్న ట్రక్కును వెనుక నుంచి మరో ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందగా..  మరో 18 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద సంఘటన ఘజియాబాద్‌లోని మురాద్‌నగర్ సమీపంలోని పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేపై చోటుచేసుకుంది. మొత్తం 35 మంది ఇటుక బట్టీ కార్మికులతో హర్యానాలోని సోనిపట్ నుండి హర్దోయ్‌కు వెళ్తున్న ట్రక్కును వెనుక నుండి మరో ట్రక్కు ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై ఘజియాబాద్ అదనపు ట్రాఫిక్ డీసీపీ వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. "కొందరు కార్మికులు విరామం కోసం దిగుతుండగా, వెనుక నుండి వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు, ఐషర్ క్యాంటర్‌ను ఢీకొట్టడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు అక్కడికక్కడే కోల్పోయారు. మృతులను మాయాదేవి (45), ఇర్షాద్ (30), నజుమాన్ (60), షమీనా(20)లుగా గుర్తించారు. బాధితులు అందరూ హర్దోయ్ జిల్లాకు చెందిన వారే. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. తరువాత చికిత్స కోసం ఘజియాబాద్ జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేశారు. తీవ్రంగా గాయపడిన తొమ్మిది మందిని ప్రత్యేక వైద్య సంరక్షణ కోసం ఢిల్లీలోని జిటిబి ఆసుపత్రికి తరలించారు" అని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.