నాలుగు లేన్లుగా ఎన్హెచ్-167.. పాలమూరు నుంచి గుడ్డెబల్లూరు వరకు 80 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం

నాలుగు లేన్లుగా ఎన్హెచ్-167.. పాలమూరు నుంచి గుడ్డెబల్లూరు వరకు 80 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం
  • రూ.3,180 కోట్లతో ప్రాజెక్టును మంజూరు చేసిన కేంద్రం
  • టెండర్లు పూర్తి.. త్వరలో ప్రారంభం కానున్న పనులు

మహబూబ్​నగర్​, వెలుగు: మహబూబ్​నగర్​ నుంచి మరో జాతీయ రహదారి నాలుగు లేన్లుగా అభివృద్ధి చెందనుంది. ఈ జిల్లా మీదుగా ఇది వరకే ఎన్​హెచ్​-44 నాలుగు లేన్లతో ఉండగా, త్వరలో నేషనల్​ హైవే 167 కూడా నాలుగు లేన్లుగా మారబోతోంది. రూ.3,180 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మంజూరు చేయగా,  ఇందుకు సంబంధించిన పనులకు ఇటీవల హైదరాబాద్​లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. టెండర్లు కూడా పూర్తి కాగా,  త్వరలో భూ సేకరణ అనంతరం పనులు మొదలు కానున్నాయి.

ప్రాజెక్టు స్వరూపం ఇదీ..
అంతర్రాష్ట్ర రహదారులను అభివృద్ధి చేసి, ఆయా ప్రాంతాల  మధ్య కనెక్టివిటీ పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రోడ్లను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్​ నుంచి పానాజి (గోవా) మార్గాన్ని మరింత సురక్షిత ప్రయాణం, సమయం ఆదా చేస్తూ వేగంగా గమ్య స్థానాలకు చేరేలా మహబూబ్​నగర్ నుంచి రాయచూర్ వెళ్లే నేషనల్​ హైవే 167ను నాలుగు లేన్లుగా చేపట్టనుంది. ఈ ప్రాజెక్టు వ్యయం మొత్తం రూ.3,180 కోట్లు కాగా, ఇందులో రూ.1,734 కోట్లు కేవలం రోడ్డు నిర్మాణం కోసం ఖర్చు చేయనున్నారు. మిగతా రూ.1,446 కోట్లను భూ సేకరణ, విద్యుత్​ స్తంభాల తొలగింపుతోపాటు ఇతర వాటికి చెల్లించనున్నారు.

మహబూబ్​నగర్​ నుంచి గుడ్డెబల్లూరు వరకు 80 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రోడ్డును వేయనుండగా, ఈ మార్గంలో మొత్తం ఐదు మేజర్​ బ్రిడ్జిలు, 36 మైనర్​ బ్రిడ్జిలు, 260 కల్వర్టులు, అన్ని రకాల వాహనాలు వెళ్లడానికి 11 వెహికులర్​అండర్​ పాస్​లు (వీయూపీ), కార్లు, బైకులు, ఆటోలు లాంటి చిన్న వాహనాలు వెళ్లడానికి 22 లైట్​ వెహికులర్​ అండర్​ పాస్​ (ఎల్​వీయూపీ)లు, ఒక రైల్వే ఓవర్​ బ్రిడ్జి (ఆర్​వోబీ), ఒక రైల్వే అండ్రర్​ బ్రిడ్జి (ఆర్​యూబీ), 48 కిలోమీటర్ల సర్వీస్​ రోడ్డు, 56 కిలోమీటర్ల లాంగ్​ స్లిప్​ రోడ్డు (హైవే నుంచి మరో రోడ్డుకు మారడానికి లేదా హైవే పైకి ఎక్కడానికి ఉపయోగించే చిన్న కనెక్టివిటీ రోడ్డు)ను నిర్మించనున్నారు. కాగా ట్రాఫిక్​ ఇబ్బందులు తలెత్తకుండా మహబూబ్​నగర్​లో మాదిరిగానే దేవరకద్ర, మరికల్, మక్తల్​ ప్రాంతాల్లో బై పాస్​ రోడ్లను ఏర్పాటు చేసి, ట్రాఫిక్​ను డైవర్ట్​ చేయనున్నారు.

సింగిల్​ రోడ్డు నుంచి ఫోర్​లేన్​..
మహబూబ్​నగర్​-రాయచూర్​ రోడ్డు మొదట్లో సింగిల్​ రోడ్డుగా ఉండేది. వాహనాల రాకపోకలకు ఎక్కువగా ఉండడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగేవి. మహబూబ్​నగర్​ నుంచి రాయచూర్​ వెళ్లాలంటే 110 కిలోమీటర్ల ప్రయాణానికి దాదాపు మూడున్నర గంటల సమయం పట్టేది. కాగా, 2012లో అప్పటి కాంగ్రెస్​ ప్రభుత్వం ఈ రహదారికి నేషనల్​ హైవే హోదా కల్పించింది. దీంతో 2015లో జడ్చర్ల నుంచి రాయచూర్​ వరకు వంద మీటర్ల రోడ్డుగా అభివృద్ధి చేశారు. దీంతో దాదాపు రెండున్నర గంటల్లో రాయచూర్​కు వెళ్లే అవకాశం ఏర్పడింది.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల మధ్య కనెక్టివిటీ పెంచేందుకు జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తుండగా, ఇందులో మహబూబ్​నగర్, రాయచూర్​కు సంబంధించిన ఎన్​హెచ్​-167కు కూడా విస్తరిస్తోంది. అలాగే ఈ హైవేను భారత్​ మాల బై పాస్​ రోడ్డు ద్వారా నేషనల్​హైవే-44కు అనుసంధానం చేయనున్నారు. దాంతో కర్నూలు, అనంతపురం, బెంగళూరు, సూర్యాపేట, నల్లగొండ, హైదరాబాద్​, ఏపీలోని తదితర ప్రాంతాల నుంచి కూడా ఈ మార్గంగుండా వాహనాలు వెళ్లనున్నాయి. 

రెండు జిల్లాల్లో అభివృద్ధికి అడుగులు..
జాతీయ రహదారి విస్తరణతో మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల అభివృద్ధిలో అడుగు ముందుకు పడునుంది. నారాయణపేట కాటన్​ చీరలకు ప్రసిద్ధి కావడంతో రవాణా వ్యవస్థ మెరుగు పడడం ద్వారా చేనేత కార్మికులకు ఈజీగా పెద్ద నగరాలకు చీరలను రవాణా చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే గిరాకీలు కూడా పెరుగుతాయి. పరిశ్రమల స్థాపన జరిగి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. 

ఈ రెండు జిల్లాల్లో పర్యాటక ప్రాంతాలైన పిల్లలమర్రి, మయూరి ఎకో పార్క్​, మన్యంకొండ, కురుమూర్తి, దత్తాత్రేయుడు వెలిసిన కురుమపురం, పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం, క్షీరలింగేశ్వర స్వామి క్షేత్రం, ఎక్లాస్​పూర్​ తిమ్మ ప్పస్వామి ఆలయం, లోకాయపల్లి లక్ష్మమ్మ ఆలయాలకు పర్యాటకుల తాకిడి పెరిగి మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉంది.