ఒకరిని కాపాడేందుకు వెళ్లి మరొకరు.. నీళ్లలో మునిగి నలుగురు మృతి..ములుగు జిల్లాలో ఇద్దరు, నిజామాబాద్‌‌‌‌లో మరో ఇద్దరు

ఒకరిని కాపాడేందుకు వెళ్లి మరొకరు.. నీళ్లలో  మునిగి నలుగురు మృతి..ములుగు జిల్లాలో ఇద్దరు, నిజామాబాద్‌‌‌‌లో మరో ఇద్దరు

వెంకటాపురం, వెలుగు : బావిలో పడిన యవకుడిని కాపాడే ప్రయత్నంలో ప్రమావదశాత్తు ఇద్దరూ చనిపోయారు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం బీసీ మర్రిగూడెం గ్రామంలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బీసీ మర్రిగూడెం గ్రామానికి చెందిన బద్ది రమేశ్‌‌‌‌ (30) వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. 

ఆదివారం ఉదయం మద్యం మత్తులో ఉన్న రమేశ్‌‌‌‌.. దుర్గమ్మ గుడి సమీపంలోని ఓ బావిలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. బావిలో ఉన్న పైప్‌‌‌‌ను పట్టుకొని కాపాడమని కేకలు వేయడంతో గమనించిన చర్చిపేట కాలనీకి చెందిన రేగ నరసింహారావు (35) తాడు సాయంతో బావిలో దిగాడు. కొంత దూరం దిగిన తర్వాత ఊపిరి ఆడడం లేదంటూ నరసింహారావు నీటిలో పడిపోయాడు. కొన్ని నిమిషాలకే రమేశ్‌‌‌‌ సైతం నీటిలో మునిగిపోయాడు.

 సమాచారం అందుకున్న వెంకటాపురం సీఐ రమేశ్‌‌‌‌, ఎస్సై కొప్పుల తిరుపతిరావు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. రెస్క్యూ టీమ్‌‌‌‌ను పిలిపించి బావిలోంచి ఇద్దరి డెడ్‌‌‌‌బాడీలను బయటకు తీశారు. బావి 70 అడుగుల లోతు ఉండడంతో ఆక్సిజన్‌‌‌‌ అందకే ఇద్దరూ చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. 

గొర్రెలు కడగడానికి వెళ్లి...

కోటగిరి, వెలుగు : గొర్రెలు కడిగేందుకు నదిలోకి దిగిన వ్యక్తి నీటిలో మునిగిపోతుండగా.. అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో వ్యక్తి సైతం చనిపోయాడు. ఈ ఘటన నిజామాబాద్‌‌‌‌ జిల్లా పోతంగల్‌‌‌‌లో ఆదివారం జరిగింది.

 కోటగిరి ఎస్సై సునీల్‌‌‌‌ తెలిపిన వివరాల ప్రకారం.. నిజమాబాద్‌‌‌‌ జిల్లా పోతంగల్‌‌‌‌కు చెందిన కుర్మ గంగొండ (53) అనే వ్యక్తి తన కొడుకు సంతోష్‌‌‌‌తో పాటు రెంజల్ మండలం బోర్గాం గ్రామానికి చెందిన బంధువులు చిక్కల గంగారాం (50)తో కలిసి ఆదివారం గొర్రెలు కడిగేందుకు మంజీరా నది వద్దకు వెళ్లారు. 

గొర్రెలు కడుగుతున్న క్రమంలో గంగారాం ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడు. గమనించిన గంగొండ అతడిని కాపాడేందుకు ప్రయత్నించగా.. ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. గమనించిన గంగొండ కొడుకు సంతోష్‌‌‌‌ కేకలు వేయడంతో స్థానికులు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని స్థానికులతో కలిసి నీటిలో గాలించగా.. గంగొండ, గంగారాం డెడ్‌‌‌‌బాడీలు దొరికాయి. 

ఈత నేర్చుకునేందుకు వెళ్లి యువకుడు గల్లంతు...

రఘునాథపల్లి, వెలుగు : ఈత నేర్చుకునేందుకు వెళ్లిన ఓ యువకుడు నీటిలో గల్లంతయ్యాడు. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో ఆదివారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మహేందర్ (35) అనే యువకుడు స్థానికంగా ఓ చికెన్‌‌‌‌ సెంటర్‌‌‌‌లో పనిచేస్తున్నాడు. 

ఆదివారం గ్రామానికి చెందిన సయ్యద్‌‌‌‌ యాకూబ్‌‌‌‌ పాషా, అతడి కుమారుడు తౌసిఫ్‌‌‌‌తో కలిసి ఈత నేర్చుకునేందుకు బావి వద్దకు వెళ్లాడు. ఈత నేర్చుకునే క్రమంలో మహేందర్‌‌‌‌ నీటిలో మునిగిపోయాడు. ఎంతకూ పైకి తేలకపోవడంతో మిగతా ఇద్దరు స్థానికులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, ఫైర్‌‌‌‌ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మహేందర్‌‌‌‌ కోసం గాలింపు చేపట్టారు.