ముందస్తుగా ఓటేసిన నాలుగు కోట్ల మంది అమెరికన్లు

ముందస్తుగా ఓటేసిన నాలుగు కోట్ల మంది అమెరికన్లు

వాషింగ్టన్: అమెరికాలో మధ్యంతర ఎన్నికలకు ఓటింగ్ మంగళవారం ప్రారంభమైంది. ఎన్నికలకు ముందే నాలుగు కోట్ల అమెరికన్లు తమ ఓటుహక్కును వాడుకున్నారు. నిర్ణయించిన పోలింగ్ స్టేషన్లలో పోస్టల్ ఓటింగ్ ద్వారా వారు ఓటు వేశారు. వ్యక్తిగతంగా లేదా మెయిల్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకున్నారు. ప్రతినిధుల సభ(దిగువసభ) లోమొత్తం 435 సీట్లకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. సోమవారమే ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రిపబ్లికన్, డెమోక్రాట్ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేశారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను చూస్తే రిపబ్లికన్లకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2018 నుంచి  ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు అధికారంలో ఉన్నారు. సభలో రిపబ్లికన్లు మెజారిటీ సాధిస్తే, బైడెన్ ప్రభుత్వ అజెండాకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. వచ్చే అధ్యక్ష ఎన్నికలపైనా ఈ ఫలితాలు ప్రభావం చూపవచ్చు. ఈ మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు విజయం సాధిస్తే, వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయాలనుకుంటున్న మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు మార్గం సుగమం అవుతుంది. 

రిపబ్లికన్లకు ఓటేయాలని మస్క్ పిలుపు

మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఓటేయాలని అమెరికన్లకు ట్విట్టర్ ఓనర్ ఎలాన్ మస్క్ పిలుపునిచ్చారు. ఇప్పటికే డెమోక్రాట్ ప్రెసిడెంట్ గా ఉన్నారని, ఈ ఎన్నికల్లో రిపబ్లికన్లు గెలిస్తే.. డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య అధికార బదిలీ జరుగుతుందని, తద్వారా ప్రభుత్వంలో ఇరు పక్షాల మధ్య సమన్వయం ఏర్పడుతుందని ట్విట్టర్​లో పేర్కొన్నారు. అమెరికా ఎన్నికలపై ఆయన స్పందించడం ఇదే మొదటిసారి.