పేపర్ల లీకేజీ కేసు..మరో నలుగురు అరెస్టు

పేపర్ల లీకేజీ కేసు..మరో నలుగురు అరెస్టు
  • వీరిలో రేణుక తమ్ముడి భార్య,
  • ఫ్రెండ్, రాజశేఖర్ రెడ్డి భార్య

హైదరాబాద్‌‌, వెలుగు: టీఎస్‌‌ పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో మరో నలుగురిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన రేణుక తమ్ముడు రాజేశ్వర్‌‌‌‌ భార్య శాంతి, ఫ్రెండ్‌‌ రాహుల్‌‌, మరో నిందితుడు రాజశేఖర్‌‌ ‌‌రెడ్డి భార్య సుచరిత, నాగార్జునసాగర్‌‌‌‌కు చెందిన రమావత్‌‌ దత్తును బుధవారం అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లి కోర్టులో హాజరుపరిచి, చంచల్‌‌గూడ జైలుకు రిమాండ్‌‌కు తరలించారు. వీరందరినీ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ ఫైల్‌‌ చేశారు. ఈ నలుగురి అరెస్టుతో నిందితుల సంఖ్య 31కి చేరింది.

న్యూజిలాండ్‌‌లో ఉన్న ప్రశాంత్‌‌ రెడ్డి మినహా మిగతా 30 మందిని సిట్‌‌ అరెస్ట్ చేసింది. కాగా, టీఎస్‌‌ పీఎస్సీ పరీక్షలు రాసిన అభ్యర్థులు, నిందితుల కాంటాక్ట్స్‌‌ ఆధారంగా సిట్​దర్యాప్తు చేస్తున్నది. ఇందుకోసం టీఎస్‌‌ పీఎస్సీ అభ్యర్థుల డేటాబేస్‌‌ పరిశీలిస్తున్నది. ఈ క్రమంలో రాజశేఖర్‌‌‌‌రెడ్డి భార్య సుచరిత, రేణుక తమ్ముడి భార్య శాంతి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్‌‌‌‌( డీఏఓ) పరీక్ష రాసినట్లు అధికారులు గుర్తించారు. వీరిద్దరికీ టాప్​ మార్కులు వచ్చాయని, వీరితో పాటు మహబూబ్‌‌నగర్‌‌‌‌కు చెందిన రేణుక ఫ్రెండ్‌‌ రాహుల్‌‌ అసిస్టెంట్‌‌ ఇంజినీర్‌‌‌‌(ఏఈ) పరీక్ష రాసినట్లు ఆధారాలు సేకరించారు. నాగార్జునసాగర్‌‌‌‌కు చెందిన రమావత్‌‌ దత్తు కూడా డీఏఓ పరీక్ష రాసినట్లు గుర్తించారు.