నలుగురు దోపిడీ దొంగల అరెస్ట్

నలుగురు దోపిడీ దొంగల అరెస్ట్
  •     పోలీసులమని చెప్పి దాడులు, దోపిడీ
  •     గతంలో ఓ వ్యక్తిని హత్య చేసిన ఇద్దరు నిందితులు
  •     వివరాలు వెల్లడించిన ఎస్పీ ఎస్పీ గౌస్ ఆలం

ఆదిలాబాద్, వెలుగు: జల్సాలకు అలవాటు పడి దోపిడీ దొంగతనాలు చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. గురువారం ఎస్పీ గౌస్ ఆలం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మే 25న ఆదిలాబాద్ పట్టణంలో మీర్జా ముషరఫ్ బేగ్(19), షేక్ బిలాల్(21), గజ్జే అక్షయ్‍(25), మేస్రం దత్తు(25) అనే వ్యక్తులు ఓ వ్యక్తిని సినీ ఫక్కీలో బెదిరించారు. తాము పోలీసులమని, చోరీ కేసులో పోలీస్​స్టేషన్​కు రావాలంటూ బెదిరించి బలవంతంగా ఆటోలో ఎక్కించే ప్రయత్నం చేశారు. ఆపై దాడి చేసి అతడి వద్ద ఉన్న రూ.10 వేలు లాక్కొని పరారయ్యారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. 

ఇదే తరహాలో మరో వ్యక్తిని కూడా..

మే 13న రైల్వే స్టేషన్ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిపై ఈ నలుగురు దాడి చేసి కారులో ఎక్కించుకొని మహారాష్ట్రకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో టాయ్​లెట్​కు ఆపినప్పుడు బాధితుడు తప్పించుకొని పారిపోయినట్లు ఎస్పీ వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. తాంసి వడ్డాడి ప్రాజెక్టులో ఓ యువకుడిని హత్య చేసిన కేసులో మీర్జా ముషరఫ్ బేగ్, షేక్ బిలాలు ఉన్నట్లు తెలిపారు. సదరు యువకుడిని కిడ్నాప్ చేసి కాళ్లు చేతులు కట్టేసి ప్రాజెక్టులో పడేయడంతో చనిపోయినట్లు విచారణలో తేలిందన్నారు. 

మృతుడి బైక్ అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఇద్దరిపై తెలంగాణలో దాదాపు 20 కేసులు నమోదైనట్లు చెప్పారు. వీరి వద్ద నుండి ఒక షిఫ్ట్ డిజైర్ కారు, ఒక ఆటో, ఓ సెల్ ఫోన్, రూ.4 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరు చోరీ చేసిన ఫోన్​ కొన్న ఓ షాప్ ​యజమానిపైనా కేసు నమోదు చేశామన్నారు. నిందితులను పట్టుకున్న ఆదిలాబాద్ డీఏస్పీ జీవన్ రెడ్డి, సిబ్బందిని ఎస్పీ అభినంధించారు.