మరో నాలుగు వందే భారత్ రైళ్లు..ఈ రూట్లలో నడపాలని నిర్ణయం

మరో నాలుగు వందే భారత్ రైళ్లు..ఈ రూట్లలో నడపాలని నిర్ణయం

వందే భారత్ రైళ్ల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం క్రమంగా పెంచుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 25 రైళ్లు నడుస్తున్నాయి. తాజాగా మరో నాలుగు వందే భారత్ రైళ్లను రైల్వే శాఖ తీసుకురానుంది. జులై నెలాఖరులోగా ఈ నాలుగు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనుంది. కొత్త రైళ్లు కలిపితే మొత్తం వందే భారత్‌ రైళ్ల సంఖ్య 29కి చేరనుంది. 

కొత్త రైళ్లు..ఇవే రూట్లు..

జులై నెలాఖరులోగా ప్రారంభించనున్న వందేభారత్ రైళ్ల రూట్లలో ఢిల్లీ-- చండీగఢ్‌, చెన్నై- తిరునల్వేలి, లక్నో - ప్రయాగ్‌రాజ్‌, గ్వాలియర్‌- భోపాల్‌ మధ్య ఉండనున్నాయి. ఢిల్లీ చండీగఢ్ రూట్ లో ఇప్పటికే చాలా రైళ్ళు ఉన్నాయి. అయితే  ప్రయాణికుల  డిమాండ్ మేరకు ఈ  రూట్లో వందే భారత్ రైలును రైల్వే శాఖ తీసుకువస్తోంది. అలాగే లక్నో - ప్రయాగ్‌రాజ్‌ మధ్య కూడా ప్రయాణికుల డిమాండ్ మేరకు  వందే భారత్  రైలు నడపనుంది.  త్వరలో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌లో గ్వాలియర్‌- భోపాల్‌ మధ్య వందే భారత్‌ రైలును తీసుకురానుంది  రైల్వే శాఖ. 

ఎంత మంది ప్రయాణం..

కొత్తగాప్రారంభించబోయే నాలుగు వందేభారత్ రైళ్లలో ఎనిమిది కోచ్‌లు ఉంటాయి.  ఇందులో ఏడు ఛైర్‌ కార్లు, ఒక ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ కోచ్‌లు ఉండనున్నాయి. ఈ నాలుగు రైళ్లలో ఒక్కొక్క దానిలో 556 మంది ప్రయాణికులు ప్రయాణించొచ్చు.  ప్రస్తుతం 25 వందే భారత్ రైళ్లలో  తొమ్మిది రైళ్లు ఎనిమిదేసి కోచ్‌లతో నడుస్తున్నాయి. 

తగ్గనున్న టికెట్ రేట్లు..

కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన  25 వందేభారత్ రైళ్లు అనుకున్నంత ఆదరణ పొందలేదు. దీనికి కారణం టికెట్ రేట్లు భారీగా ఉండటమే. ఈ నేపథ్యంలో వందే భారత్ టికెట్ల రేట్లు తగ్గించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. కేవలం వందే భారత్‌ రైళ్లు మాత్రమే కాకుండా ఛైర్‌కార్‌, ఎగ్జిక్యూటివ్‌ తరగతులు కలిగిన అన్ని రైళ్లలో 25 శాతం వరకు టికెట్‌ ధరలు తగ్గించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. టికెట్‌ ధరలపై నిర్ణయం జోనల్‌ స్థాయి అధికారులకు రైల్వే బోర్డు అప్పగించింది.