కోట్ పల్లి ప్రాజెక్టులో పడి నలుగురు మృతి

కోట్ పల్లి ప్రాజెక్టులో పడి నలుగురు మృతి

వికారాబాద్ జిల్లా : వికారాబాద్ జిల్లా కోట్ పల్లిలో విషాదం నెలకొంది. కోట్ పల్లి ప్రాజెక్టులో నలుగురు యువకులు ప్రమాదవశాత్తు గల్లంతై చనిపోయారు. నలుగురి మృతదేహాలను బయటకు వెలికితీశారు. 

వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మన్నెగూడ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు విహారయాత్ర కోసమని కోట్ పల్లి ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. ప్రాజెక్టులో బోటింగ్ తర్వాత ఈత కొడుతున్నారు. ఇంతలో ఈత రాని ఇద్దరు మునిగిపోతుండగా.. వారిని కాపాడేందుకు ఈత వచ్చిన మిగతా ఇద్దరు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే నలుగురు గల్లంతై చనిపోయారు. మృతులు లోకేశ్‌(30), వెంకటేశ్‌ (25) జగదీశ్‌(25) రాజేశ్‌(24)గా గుర్తించారు. చనిపోయిన వారు గంగిరెద్దుల కుటుంబాలకు చెందినవారుగా గుర్తించారు. 

విషయం తెలియగానే మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి వెళ్లారు. విగత జీవులుగా పడి ఉన్న తమ వారిని చూసి గుండెలు బాదుకున్నారు. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి.  సమాచారం అందుకున్న ధరూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు వెలికి తీయించారు.  ఆ తర్వాత మృతదేహాలను వికారాబాద్ ప్రభుత్వ మార్చురీకి తరలించారు. వెంకటేశ్‌ ఎంబీఏ చదువుతుండగా, రాజేశ్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.  జగదీశ్‌ వ్యవసాయం చేసేవాడు. 

సంక్రాంతి పండగ సెలవులు కావడంతో అందరూ కలిసి సరదాగా అనంతగిరి పర్యాటక కేంద్రానికి వెళ్లారు. ఆ తర్వాత కోట్ పల్లి ప్రాజెక్టుకు వద్దకు వెళ్లారు. ఈత కోసం ముందు ఇద్దరు ప్రాజెక్టులోకి వెళ్లారు. ఈ క్రమంలోనే వారు మునిగిపోతుండడం గమనించిన మిగితా ఇద్దరు వారిని రక్షించే ప్రయత్నం చేస్తుండగా.. నలుగురు నీటిలో మునిగి మృతిచెందారు. పండుగ పూట నలుగురు మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

విషయం తెలుసుకున్న జిల్లా పోలీసు అధికారులు వికారాబాద్ ఆసుపత్రికి వెళ్లి.. జరిగిన సంఘటనపై ఆరా తీశారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కూడా ఆసుపత్రికి వెళ్లి.. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. పోస్టుమార్టం త్వరితగతిన నిర్వహించి.. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని వైద్యులకు సూచించారు. మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ హామీ ఇచ్చారు. 

చెరువు వద్ద చర్యలు శూన్యం..

కోట్ పల్లి ప్రాజెక్ట్ దగ్గర గతంలోనూ చాలా మంది చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. అయినా అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.