
అహ్మదాబాద్: తొలి రెండు టెస్టుల్లో గ్రాండ్ విక్టరీలు కొట్టి.. మూడో మ్యాచ్‌లో బోల్తా కొట్టిన టీమిండియా బోర్డర్– గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో ఆఖరి పరీక్షకు సిద్ధమైంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన నరేంద్ర మోడీ స్టేడియంలో గురువారం మొదలయ్యే చివరి, నాలుగో టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్‌తో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్తు సొంతం చేసుకోవాలని ఆశిస్తోంది. అది జరగాలంటే ముందుగా ఇండియా బ్యాటింగ్ మెగాస్టార్స్ రాణించాల్సి ఉంటుంది. గత మూడు మ్యాచ్‌ల్లోనూ ఇరు జట్ల స్పిన్నర్ల ఆధిపత్యమే నడవగా.. బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. సిరీస్ విన్నర్‌ను తేల్చే ఈ పోరులో అయినా ఇండియన్స్ తమ బ్యాట్లకు పని చెప్పాల్సిన అత్యవసరం ఏర్పడింది. ఈ మ్యాచ్‌లో గెలిచి 3–1తో సిరీస్ నెగ్గితే శ్రీలంక–న్యూజిలాండ్ సిరీస్ రిజల్ట్‌తో పని లేకుండా జూన్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇండియా.. ఆసీస్‌తో తలపడుతుంది. మరోవైపు ఇండోర్ టెస్టు విక్టరీతో డబ్ల్యూటీసీ బెర్తు దక్కించుకున్న ఆసీస్ అదే ఊపుతో ఈ పోరులోనూ గెలిచి సిరీస్ పంచుకోవాలని కోరుకుంటోంది. గత మ్యాచ్‌లో స్పిన్ వికెట్ హోమ్‌టీమ్‌ను దెబ్బకొట్టిన నేపథ్యంలో అహ్మదాబాద్‌లో బ్యాటింగ్‌కు కూడా అనుకూలించే పిచ్ రెడీగా ఉంది.
టాప్ గాడిలో పడితేనే
సాధారణంగా హోమ్ సిరీస్ అనగానే టీమిండియా బ్యాటర్లు రెచ్చిపోతుంటారు. అవతలి టీమ్ బ్యాటర్లూ దంచికొట్టిన సందర్భాలూ ఉన్నాయి. కానీ, ఈ సిరీస్‌లో ఇప్పటిదాకా ఒకే సెంచరీ ఇండియా కెప్టెన్ రోహిత్ (తొలి టెస్టు) నుంచి వచ్చింది. సిరీస్‌లో రోహిత్ (207), అక్షర్ (185) టాప్ స్కోరర్లుగా ఉన్నారు. ఎక్కువగా టర్న్ లభిస్తున్న వికెట్లపై ఆసీస్ బ్యాటర్లతో పాటు ఇండియన్స్ కూడా తడబడుతున్నారు. ముఖ్యంగా టాపార్డర్ ఫెయిల్యూర్ ఇండియాను ఇబ్బంది పెడుతోంది. ఈ పోరులో అయినా ఓపెనర్లు రోహిత్, గిల్ మంచి ఆరంభం ఇస్తే.. సీనియర్లు చతేశ్వర్ పుజారా (98), కోహ్లీ (111) బ్యాటింగ్ ఆర్డర్‌ను ముందుండి నడిపించాల్సిన అవసరం ఉంది. గత మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఒంటరి పోరాటం చేసిన పుజారా ఆత్మవిశ్వాసం పెంచుకున్నాడు. క్వాలిటీ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో టీమ్‌లో అందరికంటే కోహ్లీ, పుజారాకే బాగా తెలుసు. గత మ్యాచ్‌ల్లో మాదిరిగా లోయర్ ఆర్డర్‌లో అశ్విన్, జడేజా, అక్షర్ బ్యాట్‌తోనూ మెప్పిస్తే ఇబ్బంది ఉండబోదు. ఇక, ఈ మ్యాచ్‌లో ఇండియా తుది జట్టులో మార్పులు జరిగే చాన్సుంది. సిరాజ్‌కు రెస్ట్ ఇచ్చి మహ్మద్ షమీని తీసుకోనున్నారు. ఎక్స్‌ట్రా బ్యాటర్‌ను తీసుకుంటే మంచిదన్న అభిప్రాయాలున్నాయి. కానీ, పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తే 20 వికెట్లు పడగొట్టాలంటే ఐదుగురు బౌలర్లు అవసరమే. ముగ్గురు స్పిన్నర్లకు బ్యాట్‌తో మెప్పించే సామర్థ్యం ఉంది కాబట్టి.. ఐదుగురు బౌలర్లను కొనసాగించొచ్చు. అయితే, కీపింగ్ బాగానే చేస్తున్నా.. బ్యాటింగ్‌లో తడబడుతున్న కేఎస్ భరత్ ప్లేస్‌లో ఇషాన్ కిషన్‌ను బరిలోకి దింపే చాన్సుంది. ఇషాన్ వస్తే ఓ లెఫ్టాండ్ ఆప్షన్ కూడా పెరుగుతుంది.
కాన్ఫిడెన్స్‌లో కంగారూలు
రెండు టెస్టుల్లో ఓడినా, రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్, ఓపెనర్ వార్నర్, పేసర్ హేజిల్‌వుడ్ సేవలు కోల్పోయినా ఇండోర్‌లో ఘన విజయంతో కంగారూ టీమ్ కాన్ఫిడెన్స్ అమాంతం పెరిగింది. బ్యాటింగ్‌లో లబుషేన్, ఉస్మాన్ ఖవాజా మాత్రమే రాణిస్తుండగా.. స్పిన్ త్రయం నేథన్ లైయన్, టాడ్మర్ఫి, కునేమన్ ఇండియన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేసి ఆసీస్‌ను రేసులోకి తెచ్చారు. సిరీస్ పంచుకోవాలంటే ఖవాజా, లబుషేన్‌కు తోడు స్టాండిన్ కెప్టెన్ స్మిత్ మిగతా బ్యాటర్లూ రాణించాల్సి ఉంటుంది. వికెట్ దృష్ట్యా మర్ఫి ప్లేస్‌లో ఎక్స్‌ట్రా పేసర్ స్కాట్ బోలాండ్, లాన్స్ మోరిస్‌లో ఒకరిని బరిలోకి దింపే చాన్సుంది. ఇక, ఇప్పటికే డబ్ల్యూటీసీ బెర్త్ సొంతం కావడంతో ఆసీస్ మరింత స్వేచ్ఛగా ఆడే చాన్సుంది.