కరీంనగర్: ఎవరికైనా బీభత్సంగా కలిసొస్తే.. నక్క తోక తొక్కాడ్రా అంటారు. ఈ మాటలో ఎంత నిజముందో పక్కన పెడితే.. కరీం నగర్లో ఒక ఇంటికి నక్కనే వెతుక్కుంటూ వచ్చింది. ఎక్కడ నుంచి వచ్చిందో.. ఎలా దారి తప్పి వచ్చిందో తెలియదు గానీ కరీంనగర్ నగరంలోని వావిలాల పల్లిలో ఓ ఇంట్లో ఉన్న ఆఫీస్ ప్రాంగణంలోకి నక్క దూరింది. నిన్న మధ్యాహ్నం సమయంలో నక్క వచ్చినట్లు ఆఫీస్ ఉద్యోగి మారం జలంధర్ రెడ్డి తెలిపారు.
నక్క తోక తొక్కితే అదృష్టం అని భావించే మనం, అలాంటి నక్కే మా ఆఫీస్ ప్రాంగణంలోకి రావడం పట్ల చాలా ఆనందంగా ఉందన్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి సమాచారం ఇచ్చామని, కానీ అది ఈరోజు గేటు నుంచి తప్పించుకుని వెళ్ళిపోయిందని తెలిపారు. అటవీ జంతువులకు కావలసిన ఆహారం, నీరు అందకపోతేనే ఇలా ఊళ్లలోకి వస్తుంటాయి. అటవీ శాతం అత్యల్పంగా కలిగిన జిల్లా కరీంనగర్ కావడం గమనార్హం.
కరీంనగర్లో ఇలా వన్య ప్రాణులు సంచరించడం కొత్తేం కాదు. గత నెల అక్టోబర్లో కూడా.. కరీంనగర్లో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. అక్టోబర్ 23, 2025న రాత్రి సమయంలో సైదాపూర్మండల కేంద్రంలో ఎలుగుబంటి తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడం గమనార్హం. సైదాపూర్ శివారులోని సమ్మక్క సారలమ్మ జాతర గుట్ట సమీపంలో హుజూరాబాద్, సైదాపూర్ రహదారిపై ఎలుగు బంటి తిరుగుతుండగా చూసిన గ్రామస్తులు భయంతో పరుగులు పెట్టారు.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తిలో ఎలుగుబంటి సంచారంతో 2025 జులైలో స్థానికులు ఉలిక్కిపడ్డారు. రాత్రి సమయంలో ఎలుగుబంటి ఇళ్ల మధ్య రోడ్లపై నడుచుకుంటూ వెళ్లడం సీసీ కెమెరాలో రికార్డయింది. వీధుల్లో ఎలుగుబంటి తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో చూసి ప్రజలు భయాందోళన చెందారు. గుట్టల సమీపంలోని మామిడితోటలో తిరుగుతోందని, నిత్యం కాలనీల్లో సంచరిస్తోందని స్థానికులు చెప్పారు.
