బెంగళూరు: యాపిల్ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్ ఫాక్స్‌కాన్ బెంగళూరు ఎయిర్‌పోర్టు సమీపంలో రూ. 300 కోట్లతో 300 ఎకరాల స్థలం కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం కర్నాటక రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. బెంగళూరు ఎయిర్‌పోర్టు సమీపంలోని దేవనహళ్లి వద్ద ఈ స్థలం ఉంది. తన ఇండియా సబ్సిడరీ ఫాక్స్‌కాన్ హోన్హై టెక్నాలజీ కోసం స్థలం కొన్నట్లు లండన్ స్టాక్ ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో హోన్ హై ప్రెసిషన్ ఇండస్ట్రీ వెల్లడించింది. ఇండియాలో యాపిల్ ప్రొడక్టుల మాన్యుఫాక్చరింగ్‌ను భారీగా పెంచే ఆలోచనలో ఫాక్స్‌కాన్ ఉన్న విషయం తెలిసిందే.
యాపిల్కంపెనీకి ఫాక్స్కానే అతి పెద్ద సప్లయర్. కర్నాటక రాష్ట్రంలో ఎన్నికల తర్వాత ఈ స్థలాన్ని ఫాక్స్‌కాన్ స్వాధీనంలోకి తీసుకోనున్నట్లు కర్నాటక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కమీషనర్గుంజన్ కృష్ణ చెప్పారు. కర్నాటక రాష్ట్రంలో రూ. 8 వేల కోట్లతో మొబైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు కోసం ఫాక్స్‌కాన్‌తో మార్చి 20 వ తేదీన అక్కడి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఫెసిలిటీ 50 వేల మందికి ఉపాథి కల్పిస్తుందని అంచనా. రాబోయే పదేళ్లలో ఇది మరో 50 వేలు పెరుగుతుందని చెబుతున్నారు.
తెలంగాణ ఫెసిలిటీకి మే 15న శంకు స్థాపన...
ఫాక్స్‌కాన్ మే 15 నాడు తెలంగాణలో శంకుస్థాపన నిర్వహించనుందని మరోవైపు తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మనీకంట్రోల్‌కు చెప్పారు. లక్ష ఉద్యోగాలు క్రియేట్ చేసే ఈ ప్రాజెక్టు ఇండియాలోనే ఆ కంపెనీకి అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవుతుందని జయేష్ రంజన్ పేర్కొన్నారు. ఇంతకు మించిన వివరాలను ఆయన వెల్లడించలేదు. ఫాక్స్‌కాన్ కూడా ఏ ప్రొడక్టులను తెలంగాణ ఫెసిలిటీలో తయారు చేస్తారనే ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వలేదు.