ఫాక్స్‌‌‌‌కాన్ బెంగళూరు యూనిట్లో..ఐఫోన్ 17 తయారీ షురూ

ఫాక్స్‌‌‌‌కాన్ బెంగళూరు యూనిట్లో..ఐఫోన్ 17 తయారీ షురూ

న్యూఢిల్లీ: తైవాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఫాక్స్‌‌‌‌కాన్ బెంగళూరులోని తన కొత్త తయారీ యూనిట్‌‌‌‌లో ఐఫోన్ 17 ఉత్పత్తిని ప్రారంభించింది. ఇప్పటికే చెన్నైలోని తమ ప్లాంట్‌లో ఈ ఫోన్ల తయారీ జరుగుతుండగా బెంగళూరు యూనిట్‌లో కూడా తాజాగా ఉత్పత్తిని మొదలుపెట్టింది.

బెంగుళూరులోని దేవనహళ్లిలో ఫాక్స్‌‌‌‌కాన్ రూ.25వేల కోట్ల భారీ పెట్టుబడితో ఈ కొత్త ప్లాంట్‌ను నిర్మిస్తోంది. ఇది చైనా వెలుపల ఫాక్స్‌‌‌‌కాన్‌కు రెండో అతిపెద్ద తయారీ కేంద్రం. చైనా ఇంజినీర్లు అనుకోకుండా తమ దేశానికి తిరిగి వెళ్ళిపోవడంతో కొంతకాలం ఉత్పత్తికి అంతరాయం కలిగింది. అయితే ఫాక్స్‌‌‌‌కాన్ తైవాన్‌తో పాటు ఇతర దేశాల నుంచి నిపుణులను రప్పించి ఈ సమస్యను పరిష్కరించింది.

యాపిల్ సంస్థ ఈ ఏడాది ఐఫోన్ల ఉత్పత్తిని 6 కోట్ల యూనిట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో కీలక పాత్ర పోషిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ లో 22 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను అసెంబుల్ చేశారు. ఈ ఏడాది జూన్ నెలలో అమెరికాలో అమ్ముడైన ఐఫోన్లలో ఎక్కువ భాగం భారతదేశంలోనే తయారయ్యాయి.

ఎస్ & పీ గ్లోబల్ నివేదిక ప్రకారం..గత ఏడాది అమెరికాలో మొత్తం 7.59 కోట్ల ఐఫోన్లు అమ్ముడయ్యాయి. భారత్ నుంచి ఐఫోన్ల ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది మార్చి నెలలో భారత్ నుంచి దాదాపు 31 లక్షల యూనిట్లు ఎగుమతి అయినట్లు అంచనా.