మే నెలలో ఎఫ్పీఐల పెట్టుబడులు రూ. 23,152 కోట్లు

మే నెలలో ఎఫ్పీఐల పెట్టుబడులు రూ. 23,152 కోట్లు
  • రాబోయే రోజుల్లోనూ ఇదే జోరు !

న్యూఢిల్లీ: మన ఈక్విటీ మార్కెట్లలో కొనుగోళ్ల ఆసక్తి పెంచుకున్న ఫారిన్​ ఇన్వెస్టర్లు మే నెలలో ఇప్పటిదాకా రూ. 23,152 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. యూఎస్​ ఫెడరల్​ రిజర్వ్​ వడ్డీ రేట్లను మరోసారి పెంచే ఛాన్స్​ లేదని తెలవడంతోపాటు, దేశీయంగా మార్కెట్లో అనుకూలమైన పరిస్థితులు ఉండటం వల్లే కొనుగోళ్లకు ఎఫ్​పీఐలు ఇష్టపడుతున్నారు. 2023 లో ఎఫ్​పీఐలు రూ. 8,572 కోట్ల కొనుగోళ్లతో నెట్​ బయ్యర్లుగా నిలుస్తున్నారు. రాబోయే రోజుల్లోనూ ఎఫ్​పీఐల కొనుగోళ్ల దూకుడు ఇలాగే కొనసాగుతుందనే అంచనాలు ఉన్నాయని శాంక్టమ్​ వెల్త్​ ప్రొడక్ట్స్​ అండ్​ సొల్యూషన్స్​ కో–హెడ్​ మనీష్​ జెలోకా చెప్పారు.

రూపాయి బలపడటంతోపాటు, మరోవైపు డాలర్​ వీక్​ అవుతుండటంతో ఎఫ్​పీఐలు సమీప భవిష్యత్​లో మన మార్కెట్లో కొనుగోళ్లనే చేస్తారని జియోజిత్​ ఫైనాన్షియల్​ సర్వీసెస్​ చీఫ్​ ఇన్వెస్ట్​మెంట్​స్ట్రేటజిస్​ వీ కే విజయ్​కుమార్​ పేర్కొన్నారు. డిపాజిటరీల డేటా ప్రకారం మే 2–మే 12 మధ్య కాలంలో ఎఫ్​పీఐలు ఏకంగా రూ. 23,152 కోట్లను మన ఈక్విటీ మార్కెట్లో వెచ్చించాయి. ఇంతకు ముందు ఏప్రిల్​నెలలో రూ. 11,630 కోట్లు, మార్చి నెలలో రూ. 7,936 కోట్లను ఎఫ్​పీఐలు పెట్టాయి.

ఫైనాన్షియల్​ ఇయర్​ మొదటి రెండు నెలల్లో చూస్తే నికరంగా రూ. 34,000 కోట్ల పెట్టుబడులను ఎఫ్​పీఐలు వెనక్కి తీసుకున్నాయి. యూఎస్​ రీజినల్​ బ్యాంకులు రిస్క్​లో పడటంతో మార్చి నెలలో కొంత అనిశ్చితి నెలకొందని, గ్లోబల్​గా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంతో  నమ్మకం పెరిగి ఏప్రిల్, మే నెలల్లో ఎఫ్​పీఐల పెట్టుబడులు అధికమయ్యాయని మనీష్​ జెలోకా చెప్పారు. మే నెలలో డెట్​ మార్కెట్లోనూ రూ. 68 కోట్లను ఎఫ్​పీఐలు పెట్టుబడిగా పెట్టారు. ఫైనాన్షియల్​ సెక్టార్లో జోరు కొనసాగిస్తూనే, క్యాపిటల్​ గూడ్స్​, ఆటో సెక్టార్లలోనూ ఎఫ్​పీఐలు పెట్టుబడులు పెడుతున్నారు.​