 
                                    KPHB పోలీస్ స్టేషన్ పరిధిలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసి లక్షలు దండుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి కేసు వివరాలను విలేకరుల సమావేశంలో కూకట్ పల్లి ఏసీపీ వెల్లడించారు. ఏపీ రాష్ట్రానికి చెందిన బొమ్మిడం కుమార్ బాబు అలియాస్ రవి వర్మ ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్నాడన్నారు. కేపీహెచ్ బీ కాలనీ ఎల్ఐజీలో ఉంటూ గోల్డ్ స్మిత్ గా పని చేస్తున్న మోర్త నమశివాయను కలిసి ఓ మహిళ ఫోటో చూపించి ఈమెకు డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరైందని తెలిపినట్లు వెల్లడించారు. అలాగే తన వద్ద మరో 19 ఇళ్లు ఉన్నట్లు.. డబ్బులు కడితే ఇప్పిస్తానంటూ చెప్పడంతో నిజమేనని నమశివాయ నమ్మాడన్నారు.
అతడితో పాటు మరికొంతమందిని కూడా ఇదే విధంగా చెప్పినట్లు, విడతల వారిగా వాళ్లు డబ్బులు చెల్లించారని తెలిపారు. తెలంగాణ హౌసింగ్ బోర్డ్ పేరుతో నకిలీ రశీదు తయారుచేసి నిందితుడు మోసాలకు పాల్పడుతున్నాడన్నారు. ఈనెల 21న ఒక్కొక్కరు రూ.20 వేలు తీసుకురావాలని చెప్పడంతో బాధితులకు అనుమానం వచ్చి అలాట్‌మెంట్ పేపర్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారని పేర్కొన్నారు. దీంతో అక్కడి నుంచి ఉడాయించాడని, మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించడం జరిగిందన్నారు. కేసు నమోదు చేసుకున్న కేపీహెచ్ బీ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. 2017 నుండి ఇతను చాలా మంది అమాయకులను మోసం చేస్తున్నాడని గుర్తించడం జరిగిందన్నారు. ఇప్పటికే మియాపూర్, మాదాపూర్, సనత్‌నగర్, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్ ఇతర పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయని పోలీసులు తెలిపారు.

 
         
                     
                     
                    