రైల్వే, ఎఫ్‌‌సీఐ జాబ్స్‌‌ పేరుతో మోసం

రైల్వే, ఎఫ్‌‌సీఐ జాబ్స్‌‌ పేరుతో మోసం
  • గ్రామీణ నిరుద్యోగులే టార్గెట్‌‌గా దందా
  • ఫేక్ అపాయింట్‌‌మెంట్ ఆర్డర్స్, ఐడీ కార్డ్స్‌‌
  • రూ.10 కోట్ల వరకు చీటింగ్
  • పొన్నాల భాస్కర్, మరొకరి అరెస్ట్.. రూ.9 లక్షలు స్వాధీనం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రైల్వే, ఫుడ్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ ఆఫ్ ఇండియా(ఎఫ్​సీఐ)లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న పొన్నాల భాస్కర్‌‌‌‌(57), కొండ రితీశ్ కుమార్‌‌‌‌‌‌‌‌(41)ను రాచకొండ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. రైల్వే, ఎఫ్‌‌‌‌సీఐ, ఆర్‌‌‌‌‌‌‌‌బీఐకి సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్లు, రూ.9 లక్షలు డబ్బు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్‌‌‌‌ జిల్లా హనుమకొండకు చెందిన పొన్నాల భాస్కర్‌‌‌‌‌‌‌‌ సికింద్రాబాద్ కార్ఖానలో నివాసం ఉంటున్నాడు. ఢిల్లీ స్థాయిలో రైల్వే రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ బోర్డ్‌‌‌‌ ఉన్నతాధికారులతో తనకు పరిచయాలు ఉన్నాయని ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ చీటింగ్ చేస్తున్నాడు.

బ్యాక్​డోర్​ జాబ్స్​ అంటూ ట్రాప్
ఢిల్లీకి చెందిన అశోక్‌‌‌‌ సింఘాల్‌‌‌‌, ఏకే సక్సేన, దేవేందర్‌‌‌‌‌‌‌‌ మిశ్రా, గౌహతికి చెందిన దీపక్‌‌‌‌ సిన్హా, ముంబైకి చెందిన భర్కత్‌‌‌‌ అలీ, హైదరాబాద్‌‌‌‌ ఈసీఐఎల్‌‌‌‌కి చెందిన కాశిపల్లి రవీంద్రతో కలిసి గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. ఢిల్లీలో ఆఫీస్ తెరిచాడు.  రైల్వే జాబ్స్‌‌‌‌, ఫుడ్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ ఆఫ్ ఇండియాలో జాబ్స్‌‌‌‌ ప్రాసెస్‌‌‌‌ తెలుసుకున్నాడు. హైదరాబాద్​లో లోకల్ ఏజెంట్స్‌‌‌‌ను పెట్టుకొని జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగుల డేటా కలెక్ట్ చేశాడు. గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగులను బ్యాక్‌‌‌‌ డోర్ జాబ్‌‌‌‌ పేరుతో ట్రాప్ చేశారు. ఎలాంటి పరీక్షలు లేకుండానే జాబ్స్‌‌‌‌ ఇప్పిస్తామని నమ్మించాడు.

నకిలీ ఇంటర్వ్యూలు, అపాయింట్​మెంట్​ ఆర్డర్లు
అభ్యర్థులను నమ్మించేందుకు ఫేక్​ ఇంటర్వ్యూలు నిర్వహించి.. రైల్వే రిక్రూట్‌‌‌‌మెంట్ బోర్డులోని కొంత మంది సిబ్బందితో ఫేక్ అపాయింట్‌‌‌‌మెంట్ ఆర్డర్స్‌‌‌‌, ఆఫర్‌‌‌‌‌‌‌‌ లెటర్స్‌‌‌‌ ఇప్పించాడు. ఇలా దరఖాస్తు దగ్గర నుంచి అపాయింట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ వరకు ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేశాడు. ఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌బీ ఆఫీసులకు తీసుకెళ్లి అక్కడి సిబ్బందిని పరిచయం చేసేవాడు. ఐడీ కార్డ్స్‌‌‌‌, అపాయింట్‌‌‌‌మెంట్ లెటర్స్ అందించేవాడు. ఇలాంటి ఫేక్ జాబ్ లెటర్స్‌‌‌‌తో ప్లేస్​మెంట్ ఇచ్చిన ప్రాంతానికి వెళ్లిన అభ్యర్థులు తాము మోసపోయామని గుర్తించారు. ఢిల్లీలో కేసులు నమోదవడంతో పొన్నాల భాస్కర్‌‌‌‌‌‌‌‌ ముంబైకి పారిపోయాడు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతుండు.

మాజీ మంత్రి బంధువుగా చెప్పుకుంటూ
రైల్వే, ఎఫ్‌‌సీఐలో జాబ్స్ ఇప్పిస్తామని కాశిపల్లి రవీంద్రతో కలిసి పొన్నాల భాస్కర్ 16 మంది నిరుద్యోగులను  కిందటేడు హైదరాబాద్ లో ట్రాప్ చేశాడు. వారి నుంచి రూ.93.5 లక్షలు వసూలు చేశాడు. ఫేక్ ఆపాయింట్‌‌మెంట్ ఆర్డర్స్‌‌, ఐడీ కార్డ్స్‌‌ ఇప్పించి ఢిల్లీ, ముంబై, లక్నో, కోల్‌‌కతా పంపించాడు. అక్కడికి వెళ్లాక మోసపోయామని గుర్తించిన బాధితులు గత డిసెంబర్‌‌‌‌లో జవహర్‌‌‌‌నగర్‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రికి బంధువుగా చెప్పుకొని తమను మోసం చేసినట్లు బాధితులు పోలీసులకు తెలిపారు. స్పెషల్‌‌ టీమ్స్‌‌ ఏర్పాటు చేసి పొన్నాల భాస్కర్‌‌‌‌, కొండ రితీశ్ కుమార్‌‌‌‌లను అరెస్ట్ చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్‌‌భగవత్‌‌ తెలిపారు. మొత్తం రూ.10 కోట్లకు పైగా చీటింగ్‌‌ చేసినట్లు గుర్తించామన్నారు. ఇతని బాధితులు ఎవరైనా ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పారు.