ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని మోసం

ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని మోసం
  •     రూ. 8 లక్షలు తీసుకున్న వ్యక్తులు
  •     ఫేక్‌ అపాయింట్‌మెంట్‌ లెటర్‌ అందజేత 
  •     ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య 

లింగంపేట, వెలుగు : మున్సిపల్ ఆఫీస్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని ఇద్దరు వ్యక్తులు రూ.8 లక్షలు తీసుకుని మోసం చేయడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. లింగంపేట గ్రామానికి చెందిన కుమ్మరి ప్రవీణ్​(28) అనే యువకుడికి 2019లో తాడ్వాయి మండలం చిట్యాలకు చెందిన ఆరిఫ్‌ అనే వ్యక్తితో పరిచయమైంది. మెదక్‌ మున్సిపల్‌ ఆఫీస్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌ జాబ్‌ ఇప్పిస్తానని ఆరిఫ్‌ ప్రవీణ్‌కు చెప్పాడు. అనంతరం ప్రవీణ్‌ను నిజామాబాద్‌కు చెందిన రామకృష్ణారెడ్డి అలియాస్‌ ఆర్‌కే వద్దకు తీసుకెళ్లాడు. 

ఉద్యోగం ఇప్పిస్తామంటూ ప్రవీణ్‌ వద్ద నుంచి విడతల వారీగా ఆరీఫ్​రూ.2 లక్షలు, రామకృష్ణారెడ్డి రూ.5 లక్షలు తీసుకున్నారు. నాలుగేళ్లు అయినా జాబ్‌ ఇప్పించకపోవడంతో ప్రవీణ్‌ ఇటీవల ఇద్దరిని నిలదీశాడు. దీంతో రామకృష్ణారెడ్డి మరో రూ. లక్ష ఇస్తే అపాయింట్‌మెంట్‌ లెటర్‌ ఇస్తామని చెప్పాడు. ప్రవీణ్‌ రూ. లక్ష ఇవ్వడంతో అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ ఇంటూ ఓ లెటర్‌ ఇచ్చారు. దానిని తీసుకొని ఇటీవల మెదక్‌ మున్సిపల్‌ ఆఫీస్‌కు వెళ్లగా అది ఫేక్‌ అని తేలింది. తన డబ్బులు ఇవ్వాలని ఆరిఫ్‌, రామకృష్ణను అడుగగా వారు పట్టించుకోవడంలేదు. దీంతో ప్రవీణ్‌ సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరిఫ్‌, రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.