హైదరాబాద్ లో నీటి కష్టాలు మొదలయ్యాయి. వాటర్ షార్టేజ్ కారణంగా ట్యాంకర్లతో నీళ్లు కొట్టించుకుంటున్నారు నగర వాసులు. అయితే ట్యాంకర్లను బుక్ చేసుకునే వారికి జలమండలి కీలక సూచనలు చేసింది. ప్రైవేట్ ట్యాంకర్ల నీటి సరఫరాతో పొంచి ఉన్న ప్రమాదంపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. అదే విధంగా ట్యాంకర్ బుకింగ్స్ లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు ప్రకటించింది.
హైదరాబాద్ లో జలమండలి పేరుతో ప్రైవేట్ ట్యాంకర్ల సరఫరాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. జలమండలి బోర్డు అధికారిక లోగో దుర్వినియోగంపై సీరియస్ అయ్యారు. అనుమతి లేకుండా లోగో వినియోగం పూర్తిగా చట్టవిరుద్ధమని.. ప్రజలను తప్పుదారి పట్టించే మోసపూరిత చర్యలను ఉపేక్షించేది లేదని అన్నారు.
ప్రైవేట్ బోర్‌వెల్ ట్యాంకర్ల ద్వారా అనధికార నీటి సరఫరా జరుగుతోందని.. ఈ నీరు జలమండలి ప్రమాణాల ప్రకారం శుద్ధి కాదని చెప్పారు అధికారులు. నాణ్యత పరీక్షలు లేకపోవడంతో ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడవద్దని హెచ్చరించారు. ట్యాంకర్ బుకింగ్ కోసం అధికారిక కస్టమర్ కేర్ మాత్రమే ఉపయోగించాలని తెలిపారు. టోల్ ఫ్రీ నంబర్ 155313 ద్వారా మాత్రమే బుకింగ్ చేయాలన్నారు. సురక్షిత, శుద్ధి చేసిన నీరు పొందేందుకు ఇదే ఏకైక మార్గం అని అన్నారు.
లోగో దుర్వినియోగంపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు జలమండలి అధికారులు. శుక్రవారం (మార్చి 27) జరిపిన తనిఖీల్లో ఒక ప్రైవేట్ ట్యాంకర్ స్వాధీనం చేసుకున్నారు.
సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని ఎండీ అశోక్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా దుర్వినియోగం గమనిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు.
ప్రైవేట్ ట్యాంకర్ల మోసాలపై ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనధికార లోగో వినియోగం గమనిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజల సహకారంతో అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చన్నారు. జలమండలి సేవలపై నమ్మకం కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
