
కరీంనగర్ క్రైం, వెలుగు : వెల్కం యాడ్స్ అనే యాప్ , వెల్కం క్లబ్ వెబ్‌సైట్‌తో మనీ సర్క్యులేషన్ , చైన్లింకింగ్పద్ధతుల్లో మోసాలు చేస్తున్న హైదరాబాద్ కు చెందిన దౌటం శివకుమార్, కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన కొత్తూరు ఆనంద్ లను అరెస్ట్ చేసినట్టు కరీంనగర్టౌన్ఏసీపీ తుల శ్రీనివాస్‌రావు తెలిపారు. బుధవారం కమిషనరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆయన వివరాలు తెలియజేశారు. వరంగల్ జిల్లాలోని హన్మకొండ స్నేహానగర్ చెందిన దౌటం శివకుమార్(39) ప్రస్తుతం హైదరాబాద్‌లోని బోడుప్పల్ లో ఉంటున్నాడు. ఇతడు ఆనంద్అనే వ్యక్తితో కలిసి ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నాడు. 2018 లో వెల్కం యాడ్స్అనే యాప్రూపొందించిన శివకుమార్, పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని ప్రచారం చేశాడు. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ లో కూడా అందుబాటులో ఉంచాడు. రూ.వెయ్యి నుంచి ఆ పైన ఎంత పెట్టుబడి పెట్టినా ప్రతి రోజు ఒక శాతం తిరిగి వాళ్ల అకౌంట్లో పడుతుందని నమ్మించాడు. రూ. లక్ష పెట్టుబడి పెట్టిన వారికి రోజూ రూ.వెయ్యి ఇచ్చేవాడు. దీంతో నమ్మిన జనాలు లక్షల్లో ఇన్వెస్ట్ చేశారు. ఓ పది, పదిహేను రోజుల వరకు ఇచ్చిన శివకుమార్ తర్వాత ఆపేసేవాడు. అలాగే వెల్కం క్లబ్ వెబ్సైట్ క్రియేట్ చేసి వివిధ ప్రాంతాలకు టూర్‌కు తీసుకుపోతామని, మెంబర్ అయిన వారు మరో 9మందితో డబ్బులు కట్టిస్తే ఒక్కొక్కరి నుంచి రూ.540 చొప్పున చెల్లిస్తామని చెప్పాడు. కరీంనగర్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా 7వేల మంది నుంచి మనీ సర్క్యులేషన్, చైన్ లింకింగ్పద్ధతిలో రూ.4,61,52,000 వసూలు చేసి మోసం చేశాడు. ఇలా ఇప్పటివరకు వేరు వేరు పేర్లతో సుమారు 9 వెబ్‌సైట్స్ సృష్టించి ఆన్లైన్ మోసాలకు పాల్పడ్డాడు. ఇతడిపై దేశవ్యాప్తంగా10కిపై గా కేసులు నమోదయ్యాయి. మరో కొత్తపేరుతో అప్లికేషన్ రూపొందించి చీటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తుండగా కరీంనగర్లో బుధవారం అరెస్టు చేశారు.