కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

కరీంనగర్​టౌన్, వెలుగు: గ్రూప్ 3, 4, డీఎస్సీ, గురుకులాలకు చెందిన పరీక్షల ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రవికుమార్ శుక్రవారం పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ కు చెందిన నిరుద్యోగ అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 25లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

స్టూడెంట్స్ పట్టుదలతో చదవాలి

జగిత్యాల రూరల్, వెలుగు: ప్రతి స్టూడెంట్ పట్టుదలతో చదివి ఉన్నతంగా ఎదగాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ మహాత్మ జ్యోతిబా పులే బాలికల గురుకుల పాఠశాలను శుక్రవారం ఆయన సందర్శించారు. అనంతరం స్టూడెంట్స్ తో కలిసి భోజనం చేసి నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ ఎడమల మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల అధ్వర్యంలో గ్రామానికి చెందిన అనాథ పిల్లలు పల్లవి, అభి పేరుపై రూ.40 వేల ఫిక్స్ డ్ బాండ్ ను ఎమ్మెల్యే పల్లవికి అందజేశారు. అనంతరం జగిత్యాల సారంగాపూర్ బతుకమ్మ కుంట వద్ద చెట్లకు రాఖీ కట్టారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ వసంత, కలెక్టర్ రవి నాయక్, ఎస్పీ సింధూ శర్మ, డీడిఎఫ్ఓ వెంకటేశ్వర్ రావు, సర్పంచ్ జాన్ తదితరులు పాల్గొన్నారు. 

గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయాలి 

సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు: జిల్లాలో అభివృద్ధి పనులను నిర్ధేశిత సమయంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్​లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వసతి గృహాల నవీకరణ, గంభీరావుపేట లో భవిత సెంటర్, ఉప ఆరోగ్య కేంద్రాలు, అంగన్​వాడీ కేంద్రాలు, ఎల్లారెడ్డిపేట వృద్ధుల డే కేర్ సెంటర్, డబుల్ బెడ్ రూం ఇండ్ల కాలనీలలో మౌలిక సదుపాయాలు తదితర అంశాల చర్చించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు, డీడబ్ల్యూఓ లక్ష్మీరాజం, ఎల్లారెడ్డిపేట ఎంపీడీఓ చిరంజీవి, పంచాయితీ రాజ్ ఈఈ పాల్గొన్నారు. 

నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం

బోయినిపల్లి, ‌‌‌‌‌‌‌‌వేములవాడ, వెలుగు: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తే మిడ్ మానేర్ ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ పొన్నం చేపట్టిన పాదయాత్ర శుక్రవారం ఉదయం వేములవాడలోని నందికమాన్ మారుపాక, రాత్రి బోయినిపల్లి మండలంలోని కొదురుపాకలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ఆస్తులన్నీ కార్పొరేట్ రంగాలకు తాకట్టు పెడుతోందన్నారు. మంత్రి కేటీఆర్ నిర్వాసితుల సమస్యలు తనకు తెలుసని తన అమ్మమ్మ కూడా నిర్వాసితురాలే అని, మీ అందరిని  ఆదుకుంటామని చెప్పి ముఖం చాటేశాడన్నారు. అనంతరం నీలోజిపల్లిలోని కమ్యూనిటీ  హాల్ లో రాత్రి  పొన్నం ప్రభాకర్ బస చేశారు.   

ఈద్ లా స్వాతంత్ర్య వజ్రోత్సవాలు

మెట్ పల్లి, వెలుగు : 75 ఏళ్ల స్వాతంత్ర్య వజ్రోత్సవాలను మెట్ పల్లి మండలానికి చెందిన ముస్లింలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మసీదుల్లో జుమా నమాజ్ అనంతరం ప్రతి ఒక్కరికీ జెండాలు  పంపిణీ చేశారు. ఇళ్లపై జెండాలను ఎగరేసి ప్రపంచవ్యాప్తంగా భారతీయత చాటి చెప్పాలని సూచించారు. అనంతరం జాతీయ జెండాలు చేతపట్టుకొని సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో మక్క మసీదు కమిటీ అధ్యక్షుడు మహ్మద్ షాకీర్,  మత పెద్దలు మహ్మద్ రయీసోద్దీన్, మహ్మద్ బాజీ, మహమ్మద్ ఇబ్రహీం, నదీమ్, అసిఫ్,  షాహిద్ అలీ తదితరులు పాల్గొన్నారు.

అనుమానాస్పదంగా వృద్ధురాలు మృతి

కమాన్ పూర్, వెలుగు: మండలంలోని సిద్దిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో శుక్రవారం గుర్తు తెలియని వృద్ధురాలు తీవ్ర గాయాలై మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపల్లి జీపీ సమీపంలో కమాన్ పూర్ పెంచికల్ పేట రహదారిపై రక్తపు మడుగులో వృద్ధురాలి(60) డెడ్​బాడీ కనిపించడంతో స్థానికులు కమాన్ పూర్ పోలీసులలకు సమాచారం ఇచ్చారు. ఎస్సై షేక్ మస్తాన్ ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించి మృతదేహాన్ని గోదావరిఖని ఆస్పత్రికి తరలించారు. సిద్దిపల్లి పంచాయతీ కార్యదర్శి వికాస్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

కేడీసీసీబీకి దశాబ్దపు ఉత్తమ అవార్డు

కరీంనగర్, వెలుగు: కేడీసీసీబీకి దశాబ్దపు ఉత్తమ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అవార్డు వరించింది. ఈ అవార్డును కేంద్ర గృహ, సహకార మంత్రి అమిత్ షా శుక్రవారం బ్యాంకు అధ్యక్షుడు కొండూరు రవీందర్​రావు, సీఈఓ ఎన్.సత్యనారాయణరావుకు ఢిల్లీలో అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న బ్యాంకు 2021–22 ఆర్థిక సంవత్సరం వరకు రూ. 21.42 కోట్ల లాభాలను ఆర్జించి అవార్డు సొంతం చేసుకుందన్నారు.  

పిల్లలూ.. స్కూల్​లో సమస్యలున్నయా?

స్టూడెంట్స్​ను అడిగిన మినిస్టర్​ గంగుల

కరీంనగర్‍టౌన్, వెలుగు: పిల్లలూ.. అంతా బాగున్నరా..? మీ స్కూల్​లో ఏమైనా సమస్యలున్నయా..? అని మినిస్టర్​ గంగుల కమలాకర్​విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం నగరంలోని శర్మనగర్ మహాత్మ జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలో నిర్వహించిన రక్షాబంధన్ వేడుకల్లో మంత్రి గంగుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ఆయనకు రాఖీలు కట్టారు. అనంతరం స్కూల్​లో ఏమైనా సమస్యలున్నాయా అని మంత్రి అడగగా.. తమ స్కూల్​కు సొంతభవనం లేదని, క్రీడామైదానం కావాలని అడిగారు. అలాగే నీటి ప్లాంట్ పనిచేయడం లేదని చెప్పగా యుద్ధ ప్రాతిపదికన సమస్యల్ని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం స్థానిక తెలంగాణ చౌక్ లో  రాఖీ వేడుకల్లో సీఎం చిత్రపటానికి రాఖీ కట్టారు. ఆడబిడ్డల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. మహిళల కోసం ఆసరా, వితంతు, పింఛన్లు, ఫించన్లు, కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి పథకాలు ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ ఆఫీస్ లో మహిళలు మంత్రికి రాఖీలు కట్టారు.

ఘనంగా తిరంగా ర్యాలీ 

వేములవాడ, వెలుగు : స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాల్లో భాగంగా వేములవాడ మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ అక్రమ్ ఆధ్వర్యంలో శుక్రవారం తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు.  పట్టణంలోని మల్లారం చౌరస్తా, తెలంగాణ తల్లి విగ్రహం, రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం, ప్రధాన రహదారి నుంచి తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు జాతీయ జెండాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్రమ్ మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్​లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వాతంత్ర్య అందరూ పాలుపంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.