దేశ ద్రోహం కేసులో యాక్టివిస్ట్ అరెస్ట్: 5 గంటల కల్లా రిలీజ్‌ చేయాలన్న సుప్రీం

దేశ ద్రోహం కేసులో యాక్టివిస్ట్ అరెస్ట్: 5 గంటల కల్లా రిలీజ్‌ చేయాలన్న సుప్రీం

న్యూఢిల్లీ: ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టిన కారణంగా దేశ ద్రోహం కేసులో మే నెలలో అరెస్టు చేసిన మణిపూర్ యాక్టివిస్ట్‌ లీచొంబమ్‌ ఎరెన్‌డ్రోను ఇవాళ (సోమవారం) సాయంత్రం 5 గంటల కల్లా విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఎరెన్‌డ్రో తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం ఉదయం జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. అతడి నిర్బంధాన్ని కొనసాగించడమంటే జీవించే హక్కు, స్వేచ్ఛను, ప్రాథమిక హక్కులను హరించడమేనని ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల కల్లా ఆయనను రిలీజ్ చేయాల్సిందిగా ఆదేశించింది. ఇందుకోసం వెయ్యి రూపాయల పర్సనల్ బాండ్‌ను కట్టాల్సిందిగా పిటిషనర్‌‌కు సూచించింది.
కేసు ఇదీ..
మే నెల రెండో వారంలో మణిపూర్ బీజేపీ అధ్యక్షుడు సైఖోమ్‌ తికేంద్ర సింగ్ కరోనాతో మరణించారు. ఆ సమయంలో  ‘ఆవు పేడ, మూత్రం పని చేయలేదు’ అంటూ జర్నలిస్ట్ కిశోర్ చంద్ర వాంగ్‌ఖేమ్‌, పొలిటికల్ యాక్టివిస్ట్ లీచొబమ్ ఎరెన్‌డ్రో ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్టుపై మణిపూర్ బీజేపీ వైస్‌ ప్రెసిడెంట్ఉషమ్‌ దెబాన్, ప్రధాన కార్యదర్శి ప్రేమానంద మీతై వారిపై కంప్లైంట్ ఇచ్చారు. దీంతో  పోలీసులు దేశ ద్రోహం సెక్షన్ కింద కేసు పెట్టి కిశోర్ చంద్ర, ఎరెన్‌డ్రోలను అరెస్ట్ చేశారు. అయితే గతంలో ఆవు పేడ, మూత్రంతో కరోనా నుంచి రక్షణ పొందవచ్చంటూ తికేంద్ర సింగ్ చెప్పడం గమనార్హం.