
సంగారెడ్డి, వెలుగు: పాశమైలారం సిగాచీ కెమికల్ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు ఘటనలో గాయపడిన కార్మికులకు ప్రభుత్వం తరఫున ఉచితంగా ట్రీట్మెంట్ అందిస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. ఈ ఘటనలో గాయపడి వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారిని మంత్రి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఖర్చు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని హాస్పిటళ్ల యాజమాన్యాలకు చెప్పారు.
బాధిత కుటుంబ సభ్యులను మంత్రి హాస్పిటల్ వద్ద పరామర్శించి ఓదార్చారు. అంతకుముందు ఫ్యాక్టరీని మంత్రి సందర్శించారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఇది అత్యంత దురదృష్టకరమని అన్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసు, ఫైర్ సహా అన్ని డిపార్టుమెంట్లు వేగం గా స్పందించి సహాయక చర్యలు చేపట్టా యని చెప్పారు. పేలుడు ధాటికి మూడంతస్తుల బిల్డింగ్ కూలిందని, ప్రమాదానికి గల కారణా లు తెలియాల్సి ఉందన్నారు.
క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి కార్మిక కుటుంబాన్ని కాపాడు కునే భాద్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ ఘటనను రాజకీయం చేసి తమ వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోవద్దని ప్రతిపక్షాలకు సూచించారు. ఈ పరిస్థితుల్లో అందరూ బాధితులకు అండగా నిలవాలన్నారు.