ఉచిత వ్యాక్సిన్ బిహర్‌‌కేనా?.. మిగిలిన రాష్ట్రాలకు ఇవ్వరా?

ఉచిత వ్యాక్సిన్ బిహర్‌‌కేనా?.. మిగిలిన రాష్ట్రాలకు ఇవ్వరా?

బీజేపీపై ఆప్, కాంగ్రెస్ మండిపాటు
న్యూఢిల్లీ: బిహార్‌ ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తామని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి, బీజేపీ నేత నిర్మలా సీతారామన్‌ బిహార్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. రాష్ట్రంలో బీజేపీ పవర్‌‌లోకి వస్తే ప్ర‌తి ఒక్కరికీ ఉచితంగా కరోనా టీకా అందిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీతోపాటు జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్‌‌ భగ్గుమన్నారు. కరోనా వ్యాక్సిన్‌‌ను రాజకీయ ఎజెండాగా మార్చడమేంటంటూ మండిపడ్డారు. వ్యాక్సిన్‌‌ను బిహార్‌‌కు మాత్రమే ఫ్రీగా అందిస్తారా? మిగిలిన రాష్ట్రాలకు అందించరా అంటూ ప్రశ్నించారు.

బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలకు వ్యాక్సిన్‌‌ను అందించరా అంటూ ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ బీజేపీని ప్రశ్నించింది. బీజేపీకి ఓటేయని భారతీయులకు కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వరా అంటూ ఆప్ ట్విట్టర్‌లో క్వశ్చన్ చేసింది.

‘వ్యాక్సిన్ కొనడానికి డబ్బులను బీజేపీ తన ఖజానా నుంచి ఇస్తోందా? ఒకవేళ ఆ డబ్బులను ప్రభుత్వ ట్రెజరీలో నుంచి ఇస్తున్నట్లయితే కేవలం బిహార్‌‌కు మాత్రమే ఉచితంగా వ్యాక్సిన్ ఎలా ఇస్తారు? దేశంలోని మిగిలిన రాష్ట్రాలన్నీ ఎందుకు డబ్బులు చెల్లించాలి?’ అంటూ జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా దుయ్యబట్టారు.

ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీపై విమర్శలు రావడంతో దీని మీద బిహార్‌ బీజేపీ నేత భూపిందర్ యాదవ్ స్పందించారు. కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ట్వీట్‌‌కు భూపిందర్ ఘాటుగా బదులిచ్చారు. నిర్మతా సీతారామన్ మాటలను వక్రీకరించారని భూపిందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయులందరికీ కరోనా వ్యాక్సిన్ తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుందని, అన్ని రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని భూపిందర్ పేర్కొన్నారు.