V6 News

ఫ్రీ వాటర్ స్కీమ్ వర్తించినా..రూ. 2 లక్షలకు పైగా బిల్లు

ఫ్రీ వాటర్ స్కీమ్ వర్తించినా..రూ. 2 లక్షలకు పైగా బిల్లు

ఓ అపార్ట్ మెంట్​కు డబుల్ షాక్ ఇచ్చిన వాటర్ బోర్డు


పద్మారావునగర్, వెలుగు: ఫ్రీ వాటర్ స్కీమ్ వర్తించినా ఓ అపార్ట్​మెంట్​కు రూ. 2 లక్షలకుపైగా బిల్లు వేసి వాటర్ బోర్డు షాక్​కు గురిచేసింది. బన్సీలాల్​పేట డివిజన్ ​న్యూ బోయిగూడలోని ఎంఎన్​కే విట్టల్​సెంట్రల్ ​కోర్టు అపార్ట్​మెంట్​లో 77 ఫ్లాట్లు ఉండగా.. ఫ్రీ వాటర్ స్కీమ్ కింద 2021, ఆగస్ట్​లో తమ పేర్లను నమోదు చేసుకుని బల్దియా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను అందించారు.  స్కీమ్ కింద 77 ఫ్లాట్ల ఓనర్లకు సెప్టెంబర్​2022 వరకు వాటర్ బోర్డు బిల్లులు జారీ చేయలేదు. కాగా.. మీటర్ రీడింగ్ తీయకుండానే.. గత మే 5న 1 లక్ష 74వేల182 రూపాయల బిల్లును ఇచ్చింది. దీంతో షాక్​కు గురైన అపార్ట్​మెంట్ వాసులు బిల్లును మళ్లీ పరిశీలించాల్సిందిగా కోరుతూ వాటర్ బోర్డుకు వినతిపత్రం అందించారు. 

అపార్ట్​మెంట్ నల్లా మీటర్​ పనిచేయడం లేదని, వారం రోజుల్లోగా మార్చుకోవాలని గత జూన్​ 9న అధికారులు తిరిగి నోటీసు జారీ చేశారు. అదే నెల13న కొత్త మీటర్​అమర్చుకోగా 19న ఏకంగా రూ. 2లక్షల 17వేల 948 రూపాయల బిల్లు జారీ చేసి రెండోషాక్​ఇచ్చింది. వాటర్ బోర్డుతో అగ్రిమెంట్ కుదుర్చుకున్న నల్లా మీటర్లు సప్లై చేసే సావెర్లీ ఏజెన్సీ మీటర్​ను మార్చేందుకు రూ. 25వేలు తీసుకుందని అపార్ట్​మెంట్ ప్రెసిడెంట్​ హనుమాండ్లు వాపోయారు. మీటర్లు సప్లై చేసే ఏజన్సీలతో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆరోపణలున్నాయి. దీనిపై విచారణ జరిపి బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు.