- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
యాదాద్రి, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డికి పాలమూరు, రంగారెడ్డి, మూసీ ఏటీఎంలా మారాయని, ఏఐసీసీకి తెలంగాణ ఏటీఎంగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు విమర్శించారు. పదవిని కాపాడుకొనేందుకు ప్రతి నెలా డబ్బులు పంపిస్తున్నారని ధ్వజమెత్తారు. యాదాద్రి జిల్లా వడాయిగూడెంలో మంగళవారం ప్రశిక్షణ మహా అభియాన్–2026 శిక్షణ శిబిరాన్ని ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని, దాని పేరుతో రూ.లక్ష కోట్ల డీపీఆర్ రూపొందించిన గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కు వ్యతిరేకమని తెలిపారు. హిట్లర్, కాంగ్రెస్ మనస్తత్వం ఒక్కటేనని ఎమెర్జెన్సీ విధించినప్పుడే తేలిపోయిందన్నారు.
దేశం కోసం బీజేపీ పని చేస్తుంటే.. ఇటలీ నుంచి వచ్చిన ఫ్యామిలీకి రేవంత్ గులాంగిరి చేస్తున్నారని విమర్శించారు. వడ్ల కొనుగోలుపై కాంగ్రెస్ సర్కారు అబద్ధాలు చెబుతోందని, పంట ఎంత పండుతుందనే అంచనాలు కూడా లేవన్నారు. కేంద్రం వివిధ రాష్ట్రాల నుంచి1.40 కోట్ల టన్నుల వడ్లు తీసుకుంటే, ఇందులో 52 శాతం తెలంగాణ వడ్లే ఉన్నాయని తెలిపారు.
బీజేపీ సర్కారు పన్నెండు ఏండ్లలో తెలంగాణకు రూ.13 లక్షల కోట్లు ఇచ్చినా ఏమివ్వడం లేదంటూ రేవంత్ చెప్పడం సరి కాదన్నారు. రీజినల్ రింగ్ రోడ్డును తాము వ్యతిరేకించడం లేదని, భూ సేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కేంద్రం ఇప్పటికే రూ.2,500 కోట్లు ఇచ్చిందని, రింగ్ రోడ్డుకు అనుసంధానంగా రింగ్ రైల్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కాళేశ్వరం అవినీతి నుంచి కేసీఆర్ను కాపాడేందుకు ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఉట్కూరి అశోక్ గౌడ్, వేముల అశోక్, కాసం వెంకటేశ్వర్లు, గూడూరు నారాయణ రెడ్డి, మాయ దశరథ, పాశం భాస్కర్, నరోత్తం రెడ్డి, చందా మహేందర్ గుప్తా పాల్గొన్నారు.
