- ఏ ప్రాజెక్టును అడ్డుకున్నానో నిరూపించేందుకు జర్నలిస్టులతో కమిటీ వేయాలని డిమాండ్
న్యూఢిల్లీ, వెలుగు: తనను అడ్డుకునే ధైర్యం, శక్తి సీఎం రేవంత్ రెడ్డికి లేదని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి.. అకారణంగా, అన్యాయంగా బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రేవంత్రెడ్డి వీధిరౌడీలాగా వ్యవహరిస్తున్నారని, దీనిపై తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. మంగళవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం ప్రభుత్వంతోపాటు తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
అభద్రత, అహంకారం, నిరాశ, నిస్పృహలతో నాపై తప్పుడు ప్రచారం చేస్తూ సంస్కార హీనంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. పదేండ్లు నేనే సీఎం అని చెప్పుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. అంబర్ పేట, సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సులతో తను ఢిల్లీ వరకువచ్చానని, రేవంత్ రెడ్డికి జవాబుదారీని కాదన్నారు. రేవంత్ రెడ్డి మాదిరిగా ప్రతి నెలా రాహుల్ గాంధీ వద్ద హాజరు వేసుకున్నట్లు తను ఎవరికీ గులాంగిరి చేయడం లేదని ఆరోపించారు.
తెలంగాణ అభివృద్ధిపై చర్చకు రండి..
తెలంగాణ అభివృద్ధి, ప్రాజెక్టుల విషయంలో ఎవరు తనకు కలిసినా సానుకూలంగా స్పందిస్తానని కిషన్‌రెడ్డి చెప్పారు. తను.. ఏ ప్రాజెక్టును అడ్డుకున్నానో నిరూపించేందుకు హైదరాబాద్ నుంచి పంపిస్తారా? లేదా ఢిల్లీలో ఉన్న వారినే పంపిస్తారా? సీనియర్ జర్నలిస్టులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి పంపించాలన్నారు. నేను.. ఏదైనా ప్రాజెక్టును అడ్డుకున్నట్లు జర్నలిస్టుల కమిటీ నివేదిక ఇస్తే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని కిషన్‌రెడ్డి ఛాలెంజ్చేశారు.
రేవంత్ రెడ్డి మాదిరి చిల్లర మాటలు మాట్లాడనని, ఆయన బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలుపై ఎక్కడికి చర్చకు వస్తావో? చెప్పాలని డిమాండ్చేశారు. ప్రెస్ క్లబ్ కు వస్తారా? లేదా అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్తూపం వద్దకు వస్తారో? రావాలని సవాల్ విసిరారు.
రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు..
మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి అప్పుల కుప్పగా మార్చాయని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకే రకమైన దోపిడీకి పాల్పుతున్నాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తననే ఎందుకు పదేపదే టార్గెట్ చేస్తున్నారో? అర్థం కావడం లేదన్నారు. తుమ్మిడిహెట్టి విషయంలో అపాయింట్ మెంట్ ఇవ్వకుండా మహారాష్ట్ర ముఖ్యమంత్రిని అడ్డుకుంటున్నదని కిషన్ రెడ్డే అని సీఎం చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
మెట్రో ఫేజ్ –2 విషయంలో ఎల్ అండ్ టీ విలీనం కోసం కూడా కేంద్రమే రుణం ఇప్పించిందన్నారు. వారిచ్చిన ప్రతిపాదనలు పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. మెట్రో ఫేజ్-–2 కు కేంద్రం సూత్రప్రాయకంగా అంగీకరించిందని చెప్పారు. మామునూరు విమానాశ్రయం కోసం భూసేకరణలో కాస్త ఆలస్యమైందని పేర్కొన్నారు.
