ఉత్తరాది అకాడమీల కోచింగ్ దందా.. ఐఐటీ, జేఈఈ, నీట్ పేరుతో.. హైదరాబాద్ దాటి జిల్లాల్లోనూ పాగా

ఉత్తరాది అకాడమీల కోచింగ్ దందా.. ఐఐటీ, జేఈఈ, నీట్ పేరుతో.. హైదరాబాద్ దాటి జిల్లాల్లోనూ పాగా
  • ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్ పేరుతో దందా
  •     మొన్నటి దాకా హైదరాబాద్​లో..తాజాగా జిల్లాల్లోనూ పాగా
  •     ఫ్రాంచైజీలుగా విస్తరిస్తున్న ఆకాశ్, రెజోనెన్స్, వీఎంసీ, ఫిజిక్స్  వాలా, బన్సాల్, మోషన్, కెరీర్  పాయింట్  అకాడమీలు 
  •     ఏటా రూ.వేల కోట్ల వ్యాపారం

కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ప్రముఖ ఐఐటీ, జేఈఈ, నీట్  కోచింగ్  సెంటర్లు గత కొన్నేళ్లుగా శరవేగంగా విస్తరిస్తున్నాయి. ఆకాశ్, రెజోనెన్స్, ఫిజిక్స్ వాలా, బన్సాల్, మోషన్, కెరీర్  పాయింట్, విద్యా మందిర్  క్లాసెస్(వీఎంసీ) అకాడమీ వంటి పెద్ద విద్యాసంస్థలు హైదరాబాద్‌‌‌‌తో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఫ్రాంచైజీల రూపంలో తమ బ్రాంచ్‌‌‌‌లను ఏర్పాటు చేస్తున్నాయి. ఇంటర్  విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్  వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తూ ఏటా రూ.వేల కోట్ల వ్యాపారాన్ని సాగిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్  విద్యను, ఐఐటీ, జేఈఈ, నీట్  కోచింగ్ ను దశాబ్దాలుగా శాసిస్తున్న నాలుగైదు కార్పొరేట్  కాలేజీల గుత్తాధిపత్యాన్ని ఆయా సంస్థలు గండికొడుతున్నాయి. ఆయా సంస్థల నిర్వాహకులు కార్పొరేట్  స్థాయిలో ప్రచారం చేసుకుంటూ, స్థానికులకు ఫ్రాంచైజీలు ఇస్తూ దేశవ్యాప్తంగా తమ నెట్ వర్క్ ను విస్తరిస్తున్నారు.   

ప్రముఖ సంస్థలన్నింటికీ ఫ్రాంచైజీలు, బ్రాంచ్ లు.. 

గతంలో శ్రీచైతన్య, నారాయణ, అల్ఫోర్స్, ఎస్ఆర్  వంటి కార్పొరేట్  కాలేజీలు కోచింగ్  సెంటర్  వ్యాపారాన్ని శాసించగా.. ఐదారేళ్లుగా ఐఐటీ, నీట్  కోచింగ్ కు దేశంలోనే ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్  రాష్ట్రంలోని కోటాకు చెందిన సంస్థల రాక మొదలైంది. ఆయా సంస్థలు కోటా, ఢిల్లీ, గురుగావ్, లక్నో, అలహాబాద్  తదితర సిటీలు కేంద్రంగా తమ కార్పొరేట్  ఆఫీసులను ఏర్పాటు చేసుకొని  దేశం నలుమూలల తమ కార్యకలపాలను నిర్వహిస్తున్నాయి. 

ఇలా ఢిల్లీ సమీపంలోని గురుగావ్ కు చెందిన ఆకాశ్  అకాడమీ, రాజస్థాన్ లోని కోటాకు చెందిన రెజోనెన్స్, మోషన్, విద్యా మందిర్  క్లాసెస్(వీఎంసీ), కెరీర్  పాయింట్, ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్‌‌‌‌రాజ్(అలహాబాద్)కు చెందిన ఫిజిక్స్  వాలా(విద్యా పీఠ్) తదితర అకాడమీలు తెలంగాణలోని హైదరాబాద్ తోపాటు వరంగల్, కరీంనగర్ వంటి  ఉమ్మడి జిల్లా కేంద్రాలకు క్రమంగా విస్తరిస్తున్నాయి. 

ఏటా రూ.వేల కోట్ల వ్యాపారం.. 

తమ పిల్లలకు ఐఐటీ, ఎన్ఐటీలు, పేరున్న మెడికల్  కాలేజీల్లో సీటు సాధించడమే  ప్రస్తుతం సగటు తల్లిదండ్రుల ఆశయంగా మారింది. దీంతో హైస్కూల్  స్థాయి నుంచే ఐఐటీ, మెడికల్  ఫౌండేషన్ తో కూడిన క్లాసులు చెప్పిస్తున్నారు. టెన్త్  తర్వాత ఐఐటీ, జేఈఈ, నీట్  కోచింగ్  ఇప్పించేందుకు లక్షలు ఖర్చు చేసేందుకు సైతం వెనకాడడం లేదు. తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని.. ఆయా కోచింగ్  సెంటర్లు క్యాష్​ చేసుకుంటున్నాయి. కోచింగ్  పేరిట ఏటా రూ.వేల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. 

ఉత్తరాది సంస్థలు ఇక్కడ నేరుగా తమ బ్రాంచ్ లు ఓపెన్  చేయకుండా, రాష్ట్రానికి చెందిన వ్యాపారులకు, గతంలో జూనియర్  కాలేజీలు, కోచింగ్  సెంటర్లు నడిపి ఇదే రంగంలో ఉన్న వారికి తమ ఫ్రాంచైజీలు ఇస్తున్నారు. ఫ్యాకల్టీని రిక్రూట్  చేయడంతో పాటు వారికి తమ సిలబస్, ప్రోగ్రామ్ పై ట్రైనింగ్  ఇచ్చి ఫ్రాంచైజీ నిర్వాహకులకు అప్పగిస్తున్నారు. ఆ తర్వాత స్టడీ మెటీరియల్, మాక్  ఎగ్జామ్  క్వశ్చన్  పేపర్స్ వంటివన్నీ వారే సప్లై చేస్తున్నారు. ఇందుకుగాను ఒక్కో స్టూడెంట్  ఫీజు 30 శాతం నుంచి 40 శాతాన్ని ఆయా సంస్థల ఓనర్లు  ఫ్రాంచైజీదారుల నుంచి వసూలు చేస్తున్నారు. సిబ్బంది జీతాలు, అకాడమీల నిర్వహణ, ప్రచారం ఖర్చంతా ఫ్రాంచైజీ తీసుకున్నవాళ్లే భరించాల్సి ఉంటుందని హైదరాబాద్ కు చెందిన ఓ ఐఐటీ కోచింగ్  సెంటర్  నిర్వాహకుడు వెల్లడించారు. దీంతో విద్యార్థుల నుంచి ఫీజులు ఎక్కువగా వసూలు చేయాల్సి వస్తుందని తెలిపారు. 

ఇంటర్ బోర్డు అఫ్లియేషన్ లేకపోయినా అడ్మిషన్లు.. 

కోటా, ఢిల్లీకి చెందిన ఐఐటీ, జేఈఈ, నీట్  అకాడమీల్లో చదివేవారంతా  ఇంటర్  విద్యార్థులే. అయితే ఆయా అకాడమీలు ఇంటర్  కాలేజీలు కాకపోవడంతో ఆయా విద్యార్థుల అడ్మిషన్లను ఇతర ప్రైవేట్, గవర్నమెంట్  జూనియర్  కాలేజీల్లో తీసుకుంటున్నారు. క్లాసులు ఆయా అకాడమీల్లో వింటున్నారు. కొందరు చిన్న ప్రైవేట్  జూనియర్  కాలేజీల నిర్వాహకులు ఒక్కో స్టూడెంట్ కు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు తీసుకొని తమ కాలేజీల నుంచి ఫార్వర్డ్  చేస్తున్నారు. దీంతో ఒకరకంగా అడ్మిషన్లు లేక మూతపడేందుకు సిద్ధంగా ఉన్న జూనియర్  కాలేజీలు అకాడమీల అడ్మిషన్లతో అదనపు సెక్షన్లకు వెళ్తున్నాయి.

ఇంటర్ స్టూడెంట్లు చేరొద్దు.. 

ఇంటర్  విద్యార్థులు ఇంటర్మీడియట్  బోర్డు అనుమతి ఉన్న జూనియర్  కాలేజీల్లో మాత్రమే చేరాలి. అకాడమీల్లో జాయిన్  కావొద్దు. బన్సాల్  క్లాసెస్, ఫిజిక్స్ వాలా, రెజోనెన్స్, ఆకాశ్, గ్రావిటీ, ర్యాంక్  ఫోర్డ్  వంటి అకాడమీలు కోచింగ్  సెంటర్లు మాత్రమే. ఇంటర్మీడియట్  జూనియర్  కాలేజీలు కావు. తల్లిదండ్రులు, విద్యార్థులు గమనించాలి.

– ఆంజనేయరావు, డీఐఈవో, కరీంనగర్

కోచింగ్  మాఫియాను నియంత్రించాలి

రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న కార్పొరేట్  కాలేజీలు ఐఐటీ, జేఈఈ, నీట్  కోచింగ్  పేరిట విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. వీటికితోడు నాలుగైదేళ్లుగా రాష్ట్రంలో ఉత్తరాది కోచింగ్  సెంటర్లు విస్తరిస్తున్నాయి. వీటిపై ఇంటర్  బోర్డు, విద్యా శాఖ నియంత్రణ లేదు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఆయా సంస్థలను ప్రారంభిస్తున్నారు. కరీంనగర్ లో బన్సాల్  క్లాసెస్  పేరిట గత ఏడాది కోచింగ్  సెంటర్  తెరిచి ఒక్క ఏడాదికే బోర్డు తిప్పేశారు. అందుకే ఇంటర్  బోర్డు అనుమతి లేకుండా ఇంటర్  క్లాసులు నిర్వహిస్తున్న అకాడమీలపై ప్రభుత్వం దృష్టి సారించి చర్యలు తీసుకోవాలి.

– కసిరెడ్డి మణికంఠ రెడ్డి, ఏఐఎస్ఎఫ్  రాష్ట్ర అధ్యక్షుడు