గుంటుపల్లిలో మోనిన్ ​ప్లాంట్​..రూ. 300 కోట్ల పెట్టుబడితో నిర్మాణం 

గుంటుపల్లిలో మోనిన్ ​ప్లాంట్​..రూ. 300 కోట్ల పెట్టుబడితో నిర్మాణం 

  హైదరాబాద్, వెలుగు :  ఫ్రాన్స్​కు చెందిన బేవరేజెస్​ తయారీ కంపెనీ, జార్జెస్ మోనిన్ భారతదేశంలో తన మొదటి ప్లాంటును హైదరాబాద్ శివార్లలో సంగారెడ్డి జిల్లా  గుంటపల్లి గ్రామంలో నిర్మించనుంది. ఇది 40 ఎకరాల స్థలంలో ఏర్పాటవుతుంది. ప్లాంట్లు కోసం రూ.300 కోట్లు ఇన్వెస్ట్​ చేస్తున్నట్టు తెలిపింది. ఇందులో మోనిన్​ ఇండియా హెడాఫీస్​, ఆర్​అండ్​డీ కేంద్రం, మాన్యుఫాక్చరింగ్​ ఫెసిలిటీ ఉంటాయి. వంద మందికి ఉపాధి దొరుకుతుంది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ ​డెవెలప్​మెంట్​, ఐటీశాఖల మంత్రి కేటీఆర్​, ఈశాఖల ముఖ్య కార్యదర్శి జయేష్​ రంజన్​, బెంగళూరులోని ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ థియరీ బెర్థెలాట్, జార్జెస్ మోనిన్ ఛైర్మన్  ఒలివర్ మోనిన్ తదితరులు పాల్గొన్నారు. భూమిపూజ అనంతరం కేటీఆర్​ మాట్లాడుతూ ‘‘తెలంగాణలో మోనిన్​ తన కార్యకలాపాలను ప్రారంభించినందుకు    చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి  కేసీఆర్​ సమర్ధవంతమైన నాయకత్వం కారణంగా తెలంగాణలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి.

రాష్ట్రంలో పెట్టుబడిదారుల లిస్టులో మోనిన్ చేరడంతో, రాష్ట్ర ఆహార ప్రాసెసింగ్ ఎకోసిస్టమ్​ మరింత వృద్ధి చెందుతుంది. తెలంగాణను తమ హబ్‌‌‌‌గా మార్చు కోవాల్సిందిగా మోనిన్‌‌‌‌ని కోరుతున్నాను.  ఇప్పుడు రూ. 300 కోట్ల పెట్టుబడి పెట్టడమే కాకుండా మరింత విస్తరిస్తారని ఆశిస్తున్నాను" అని అన్నారు.  మోనిన్ టీమ్​కు స్థానిక శాసనసభ్యులతో పాటుగా ఆఫీసర్లు అన్ని విధాలా సహకరిస్తారని భరోసా ఇచ్చారు.

స్థానిక యువతకు ఉపాధి కల్పించాల్సిందిగా ఆయన కంపెనీని కోరారు. ఒలివర్​ మోనిన్​ మాట్లాడుతూ చాలా కంపెనీలకు భారతదేశం గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యమైన మార్కెట్‌‌‌‌గా మారిందని, అందుకే ఇక్కడ తమ యూనిట్​ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తమ విస్తరణ ప్రణాళికలకు ఈ కేంద్రం తోడ్పడుతుందని చెప్పారు.