బీఆర్ఎస్ పాలనలో.. ఫ్రెండ్లీ పోలీసింగ్​ ఓ జోక్ : ఆకునూరి మురళి

బీఆర్ఎస్ పాలనలో.. ఫ్రెండ్లీ పోలీసింగ్​ ఓ జోక్ :  ఆకునూరి మురళి

బీఆర్ఎస్ హయాంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఒక జోక్ అని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి విమర్శించారు. ఇంటరాగేషన్ పేరుతో చిత్రహింసలకు గురి చేసే పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన మరియమ్మ, ఖాదిర్ ఖాన్, సూర్య నాయక్ లాకప్ డెత్​లపై బుధవారం ఆయన ట్విట్టర్​లో స్పందించారు. ‘‘నిందితులు ఎంత పెద్ద తప్పు చేసినా.. పోలీసులు వారిని హింసించడం నాగరిక సమాజానికి మంచిది కాదు. 

పోలీసులు తమ పద్ధతి మార్చుకోవాలి. చిత్రహింసలు పెట్టే పోలీసులను గుర్తించి విచారించాలి. అలాంటి వారిని ఉద్యోగాల నుంచి తీసేస్తే తప్ప థర్డ్ డిగ్రీ హింసలు ఆగవు. ఇలాంటి ఘటనలపై యూరప్​, అమెరికా, కెనడా వంటి వెస్ట్రన్ కంట్రీస్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కొత్త ప్రభుత్వంలో థర్డ్ డిగ్రీ ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత డీజీపీ, ఎస్పీల మీద ఉన్నది”అని ఆకునూరి మురళి అన్నారు.

ఆ పోలీసులపై చర్యలు తీసుకోవాలి

సీఎం కూడా పోలీస్ శాఖకు తగిన సూచనలు ఇవ్వాలని ఆకునూరి మురళి కోరారు. చింతకాని పోలీస్ స్టేషన్​లో ఎస్సీ మహిళ, మెదక్​లో ఖాదిర్ ఖాన్, చింతపల్లిలో సూర్యనాయక్ లాకప్​డెత్​లకు కారణమైన పోలీసులపై ఎఫ్ఐఆర్ బుక్ చేసి విచారించాలన్నారు. ఎల్బీ నగర్​లో గిరిజన మహిళ లక్ష్మిని హింసించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. అప్పుడే ప్రజాస్వామ్య దేశంలో నివసిస్తున్నాం అనే భావన అందరిలో కలుగుతుందని తెలిపారు. థర్డ్ డిగ్రీ ఘటనలపై దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీని ఆయన కోరారు.