ఫిబ్రవరి 5 నుంచి.. బీజేపీ కార్నర్​ మీటింగ్స్

ఫిబ్రవరి 5 నుంచి.. బీజేపీ కార్నర్​ మీటింగ్స్
  • శక్తి కేంద్రాల స్థాయిలో సమావేశాలు
  • 15 రోజుల్లో 9వేల మీటింగ్స్ పెట్టాలని నిర్ణయం
  • గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యం
  • ఢిల్లీ డైరెక్షన్ లో స్టేట్ పార్టీ కసరత్తు

హైదరాబాద్, వెలుగు : గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా బీజేపీ కార్నర్ మీటింగ్స్ కు రెడీ అవుతున్నది. వాస్తవానికి ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 5 దాకా గ్రామ స్థాయిలో 9వేల కార్నర్ మీటింగ్స్ నిర్వహించాలని నిర్ణయించుకుంది. అయితే, ఇప్పుడు వీటిని గ్రామ స్థాయిలో కాకుండా శక్తి కేంద్రాల స్థాయిలోనే నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది. దీంతో వీటిని వచ్చే నెల 5 నుంచి 20 దాకా కొనసాగించాలని బీజేపీ తాజాగా నిర్ణయించింది. ఈ నెల 24న మహబూబ్ నగర్ లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉండడం, 28న తెలంగాణలో అమిత్ షా టూర్ కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. మిషన్ 90లో భాగంగా పల్లెల్లో ప్రతీ గడపకు బీజేపీని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆ పార్టీ ఈ కార్నర్ మీటింగ్ లకు రెడీ అవుతున్నది. బీఆర్ఎస్ సర్కార్ కుటుంబ పాలన, అవినీతి, ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరించడమే ప్రచార అస్త్రాలుగా ఈ కార్నర్ మీటింగ్స్ ఉండనున్నాయి. అదేవిధంగా కేంద్రంలో మోడీ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలు కూడా కార్నర్ మీటింగ్​ల ద్వారా జనాలకు వివరించాలనేది బీజేపీ హైకమాండ్​ ప్లాన్. ఈ పద్ధతిని ఇప్పటికే గుజరాత్, పశ్చిమ బెంగాల్, యూపీలో అమలు చేసి సక్సెస్ అయ్యామనే భావన హైకమాండ్ లో ఉండడంతో.. దీన్ని తెలంగాణలోనూ ఇంప్లిమెంట్​ చేయాలనేది బీజేపీ ఆలోచన.

చేరికలపై స్పెషల్​ ఫోకస్

ఇదే టైంలో పార్టీలో చేరికలను కేవలం నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలకే పరిమితం కాకుండా బూత్ స్థాయి నేతలను, లోకల్ బాడీల ప్రజాప్రతినిధులను కూడా చేర్చుకోవాలని సెంట్రల్ పార్టీ సూచించింది. ఈ కార్నర్ మీటింగ్స్​లో పెద్ద సంఖ్యలో సర్పంచ్ లు, ఎంపీటీసీలను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ సిద్ధం అవుతున్నది. ఫస్ట్​ సర్పంచ్ ల సమస్యలపై కార్నర్ మీటింగ్స్​లో ప్రస్తావించి.. తర్వాత వారిని బీజేపీలోకి ఆహ్వానించాలనేది పార్టీ పెద్దల ప్లాన్. దీంతో ప్రతీ విలేజ్​లో బూత్ స్థాయిలో పార్టీకి బలమైన నేత దొరుకుతారనేది బీజేపీ ఉద్దేశం. సర్పంచ్ ల అధికారాలను బీఆర్ఎస్ ఏవిధంగా హరిస్తున్నది.. జీపీలకు కేంద్రం ఇచ్చిన నిధులను ఏవిధంగా దారిమళ్లిస్తున్నది.. ఎంపీటీసీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న తీరును కార్నర్​ మీటింగ్స్​ ద్వారా ఎండగట్టాలని పార్టీ పెద్దలు ఆదేశించారు.